పూజారికి కేటాయించిన స్థలాన్ని తీసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

పూజారికి కేటాయించిన స్థలాన్ని తీసుకోవద్దు

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

యాచారం: గ్రామ పూజారికి కేటాయించిన గది స్థలంలో మహిళా సంఘం భవనాన్ని నిర్మించొద్దని యాచారం గ్రామ పంచాయతీ ఒకటో వార్డు సభ్యుడు మారోజ్‌ ప్రదీప్‌చారి గురువారం మండల పంచాయతీ అధికారి శ్రీలతకు ఫిర్యాదు చేశారు. గ్రామ ఉప సర్పంచ్‌ మంగతో పాటు మరో ఐదుగురు వార్డు సభ్యులు, వంద మందికి పైగా గ్రామస్తుల సంతకాలతో కూడిన ఫిర్యాదును ఎంపీఓకు అందజేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పూజారికి కేటాయించిన గదిని కూల్చి మహిళా సంఘం భవనాన్ని నిర్మించాలని చూడడం సరైంది కాదన్నారు. గతంలో పిల్లర్లు వేసిన స్థలంలోనే డ్వాక్రా సంఘం మహిళా భవనం నిర్మిస్తే గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.

ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రచారం

తుర్కయంజాల్‌: ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే బడిబాట లక్ష్యమని కోహెడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మీలా విజయ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో ఆదిబట్ల సర్కిల్‌ పరిధి సంఘీనగర్‌లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని వివరించారు. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఓబీసీ మోర్చా కో కన్వీనర్‌గా విష్ణుగౌడ్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌: బీజేపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఓబీసీ మోర్చా కో–కన్వీనర్‌గా మండలంలోని బాటసింగారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు బండిగారి విష్ణుగౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విష్ణుగౌడ్‌ మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో నియోజకవర్గ ఓబీసీ మోర్చా కో–కన్వీనర్‌ పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, ఓబీసీలంతా బీజేపీ వైపు మొగ్గు చూపే విధంగా కృషి చేస్తానన్నారు.

జ్యూట్‌ బ్యాగుల పంపిణీ

మంచాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని మండలంలోని రంగాపూర్‌ సర్పంచ్‌ బాలకృష్ణ సూచించారు. గురువారం రంగాపూర్‌ అనుబంధ గ్రామం జలాల్‌మీయా పల్లెలో బీఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు జ్యూట్‌ బ్యాగులు, యువకులకు టీం షర్ట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ యాదగిరి, వార్డు సభ్యులు అశోక్‌, మనిత, దివ్య, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌లు జంగారెడ్డి, బాబయ్య, అంగన్‌ వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యపరిష్కరించాలని డిమాండ్‌

తుక్కుగూడ: మంఖాల్‌ డివిజన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డివిజన్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు కోటకాడి శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మంఖాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల నుంచి డివిజన్‌లో సరిపడా నీరు రావడం లేదన్నారు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి వేల రూపాయలు ఖర్చు చేసి నీటిని కొనుగోలు చేస్తున్నారన్నారు. నీటి సమస్యపై పలుమార్లు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి మంఖాల్‌లో సరిపడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో శంషాబాద్‌ జోనల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement