యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

పహాడీషరీఫ్‌: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన బొల్లు బుచ్చయ్య కుటుంబం తుక్కుగూడ బసవగూడ తండాకు నెల క్రితం వలస వచ్చి కూరగాయల ఫామ్‌లో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి నిద్రించగా, మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి చూడగా అతని చిన్న కుమార్తె సునీత (21) కనిపించలేదు. పరిసరాల్లో గాలించినా లాభం లేకుండా పోయింది. కుల్కచర్లకు చెందిన రమేష్‌ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పేకాట స్థావరాలపై దాడులు

కొందుర్గు: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్‌లో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్‌ తెలిపారు. ఈ దాడుల్లో రూ.60,800 నగదు, ఏడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇద్దరు సుడాన్‌ దేశస్తులకు ఎబోలా నెగెటివ్‌

గాంధీ ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జి

గాంధీఆస్పత్రి: ఎబోలా వైరస్‌ అనుమానితులకు నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు నుంచి వారిని మంగళవారం డిశ్చార్జీ చేశారు. గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొ.వాణి, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఎబోలా స్క్రీనింగ్‌ పరీక్షల్లో సూడాన్‌ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఎబోలా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్యసేవలు అందించారు. వారి నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించగా, నిర్ధారణ పరీక్షల్లో ఎబోలా నెగెటివ్‌ వచ్చినట్లు పుణే వైరాలజీ ల్యాబ్‌ అధికారికంగా ధ్రువీకరించిన సంగతి విధితమే. ఈ నేపధ్యంలో 48 గంటల తర్వాత మరోమారు శాంపిల్స్‌ సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా, రెండోసారీ ఎబోలా నెగెటివ్‌ రావడంతో సెల్ఫ్‌ మానిటరింగ్‌ చేసుకోవాలని, అందుకు అవసరమైన విధానాలు, పద్ధతులు, జాగ్రత్తలు చెప్పి వారిని డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్‌ వార్డులో ఎబోలా అనుమానితులెవరూ లేరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement