● సివిల్ సప్లయిస్ కార్యాలయం వద్ద ఐద్వా నిరసన
పంజగుట్ట: రేషన్‌షాపుల్లో బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో సామాన్యుల జీవనం భారంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆహార భద్రత, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి బియ్యంతోపాటు, పప్పు, మంచినూనె, మొక్కజొన్నలు రెండు కేజీల చొప్పున, చక్కెర కేజీ, కారం 500 గ్రాములు, పసుపు 250 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, పామాయిల్ లీటర్, కొబ్బరి నూనె 250 గ్రాములు, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులను రేషన్ షాపుల ద్వారా అందించాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయకార్యదర్శులు కేఎన్ ఆశాలత, కె.నాగలక్ష్మి, పి.శశికళ, వై.వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.


