కొత్తూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సర్పంచ్ ఎర్రొళ్ల జగన్ కోరారు. మండలంలోని పెంజర్ల గ్రామంలో చంద్రమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సోమవారం ఆయన పలువురితో కలిసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా చంద్రమ్మకు దుస్తులు అందజేశారు. విడతల వారీగా గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తడి, పొడి చెత్తపై అవగాహన
మొయినాబాద్‌రూరల్: ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు ధరిచేరవని సర్పంచ్ పాషా అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండల పరిధిలోని కుత్బుద్దీన్‌గూడలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లోని చెత్తను ప్రభుత్వం సూచిస్తున్న విధంగా నాలుగు విధాలుగా వేరుచేసి గ్రామ పంచాయతీ ద్వారా సేకరిస్తున్న చెత్త బండిలో వేయాలని సూచించారు. ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భూపాల్, పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఆలూరి రవీందర్, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన క్రికెట్ టోర్నీ
షాద్‌నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహించిన చేగూరు జూనియర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో చైన్నె, బెంగుళూరు జట్ల మధ్య పోటీ జరిగింది. ఉత్సంఠ భరితంగా సాగిన పోటీలో బెంగుళూరు జట్టు విజయం సాధించగా.. రూ.10వేల నగదు, రన్నర్ జట్టుకు రూ.5వేల నగదుతో పాటు నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో చేగూరు ఉపసర్పంచ్ శివశంకర్, వెంకమ్మగూడ సర్పంచ్ అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి
చేవెళ్ల: పట్టణ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్లలోని ఆర్డీఓ కార్యాలయం ప్రజావాణిలో, విద్యుత్‌శాఖ కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన విద్యుత్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యుత్ ఏడీ సాయినాథ్ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీనిచ్చారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్గారి వైభవ్‌రెడ్డి, శర్వలింగం, సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
రోడ్డు పనులు ప్రారంభం
షాబాద్: మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామ శివారు నుంచి మక్తగూడ శివారు వరకు పంట పొలాల వెంబడి చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ మంగమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
శంకర్‌పల్లి: ఎమ్మెల్యే కాలె యాదయ్యను సోమవారం ప్రొద్దటూరు గ్రామస్తులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రొద్దటూరు–మేడిపల్లి, ప్రొద్దటూరు–టంగటూరు గ్రామాలను కలిపే రెండు రోడ్ల నిర్మాణానికి గాను ఎమ్మెల్యే కృషితో రూ. 5.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి, శాలువా కప్పి సన్మానించారు. పనులను సత్వరమే ప్రారంభించి, పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాభివృద్ధికి మున్ముందు ఎమ్మెల్యే ఇలానే సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ బండ లక్ష్మినర్సింహా కోరారు.


