మండల వ్యవసాయాధికారి అనురాధారెడ్డి
మొయినాబాద్‌రూరల్: రైతులు భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య పోషక యాజమాన్యం చేపడితేనే సాగు ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని రైతులకు కేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై కేవీకే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే నిపుణులు డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ కృష్ణ, సుధీర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


