షాద్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌కు సంబంధించిన భూసేకరణపై సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ఈఈ దయానంద్, ఎస్‌ఈ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, నిర్మాణ పనులు, పరిపాలనా అనుమతుల గురించి అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 19 నుంచి 21 చేపట్టే పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకొన్నారు. జడ్చర్లలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కొందుర్గు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి వరకు కాల్వలు, టన్నెల్ నిర్మాణాలకు మొత్తం 2,919 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. భూసేకరణకు సుమారు రూ.350కోట్లు వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేసి.. పరిపాలన, ఆర్థిక అనుమతులు ప్రభుత్వం నుంచి పొందేందుకు తగిన చర్యలు చేపట్టాలని, నిర్ణీత గడువులోపు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.


