మురుగుతో పరేషాన్ ! డ్రైనేజీ పైప్‌లైన్ పక్కనే తాగునీటి లైన్ లింగోజిగూడ: మంచినీటి పైప్‌లైన్‌ను డ్రైనేజీ పైప్‌లైన్ పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీవాసులు అభ్యంతరం చెబుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. శివపురి కాలనీలో జలమండలి అధికారులు నూతన మంచినీటి పైప్‌లైన్‌ను డ్రైనేజీ పైప్‌లైన్ పక్కనే వేస్తుండటంతో కాలనీవాసులు జలమండలి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మంచి నీటి పైప్‌లైన్‌ను కనీసం డ్రైనేజీ పైప్‌లైన్‌కు నాలుగు అడుగుల దూరంలో నిర్మించాలని కాలనీ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పక్కపక్కనే ఉన్నందున భవిష్యత్‌లో మంచినీటితో మురుగునీరు కలిసే ప్రమాదం ఉందన్నారు. జలమండలి అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఆయన సూచించారు. అధికారుల తీరు మారకపోతే జలమండలి కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
డ్రైనేజీ నుంచి ఉప్పొంగుతున్న మురుగు ● నివారణ చర్యల్లో తీవ్ర జాప్యంపై ప్రజాగ్రహం
మన్సూరాబాద్–ఆటోనగర్ రోడ్డు కేబీఆర్ కన్వెన్షన్ ఎదురుగా కొన్ని రోజులుగా డ్రైనేజీ నుంచి మురుగు పొంగి రోడ్డుపై వరదలా పారుతోంది. సుమారు 15 కాలనీలవాసులు ఈ మురుగు వరదనీటి నుంచి నడవాల్సిన దుస్థితి నెలకొంది. నివారణ చర్యలు తీసుకోవడంలో సీవరేజీ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శైలజాపురి కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన స్పందించి మురుగుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
– మన్సూరాబాద్
మన్సూరాబాద్–ఆటోనగర్ రోడ్డు కేబీఆర్ కన్వెన్షన్ వద్ద డ్రైనేజీ నుంచి పొంగిపొర్లుతున్న మురుగు