నాగోలు: పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నాగోలు–బండ్లగూడ ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై సోమవారం బండ్లగూడ నుంచి నాగోలు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ... బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి పరిరక్షణ పర్యావరణ అవగాహన లక్ష్యాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రకృతిని ప్రేమిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే సందేశంతో ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తూ, మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, ఆరోగ్య పరిరక్షణకు నడక ఆవశ్యకతను వివరించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షుడు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రటరీ పెంటారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ప్రతాప్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు చిరంజీవి, ఈశ్వర్ గౌడ్, సీతారాములు పాల్గొన్నారు.
ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి


