మన్సూరాబాద్: పెద్దచెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్దచెరువు ప్రాంగణం, చెరువులో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలకు గత మూడు రోజులుగా స్వచ్ఛంద సేవకులు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. చెరువులోని ట్రక్కుల కొద్ది చెత్తను బస్తాల్లో వేసి మరో ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ... రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని చెరువులోని వ్యర్థాలను తొలగించామని, వరదనీటితోనే చెరువును నింపి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నామన్నారు. వరదకాలువలోకి డ్రైనేజీ మురుగును కలుపుతుండటంతో చెరువులోకి మురుగు నీరు చేరి దుర్వాసన వస్తుందని పేర్కొన్నారు. వరద నీటికి, డ్రైనేజీ మురుగుకు ప్రత్యేకంగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు వేమారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాంపల్లి రామేశ్వర్, కవితారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్ది, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


