హుడాకాంప్లెక్స్: యువత క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని క్రీడాప్రాధికార సంస్థ తెలంగాణ ఉప సంచాలకుడు రవీందర్ పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో శనివారం వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోపాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటారన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ చిన్నారులు, యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వం, మానసిక వికాసం, జట్టు భావన పెంపొందించడమే లక్ష్యంగా సరూర్‌నగర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించినట్టు తెలిపారు. జిల్లా యువజన, క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరింతమంది యువత క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కోచ్‌లు, సిబ్బంది, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ధ్రువపత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల కోచ్‌లు, సిబ్బంది, క్రీడాభిమానులు పాల్గొన్నారు.


