ఎర్రకుంట వాగు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎర్రకుంట వాగు పరిశీలన

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

స్పందించిన రెవెన్యూ అధికారులు

ప్రహరీ నిర్మాణం కోసం తవ్విన పునాది పూడ్చివేత

మొయినాబాద్‌: వాగులు కాలువలను కబ్జాచేస్తే కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలోని సురంగల్‌ రెవెన్యూలో ఉన్న ఎర్రకుంట వాగును కబ్జాచేస్తూ ప్రహరీ నిర్మాణానికి చేపట్టిన తవ్వకాలపై ‘వాగులైనా వదలం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శనివారం తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, సర్వేయర్‌ జలజ, సిబ్బందితో కలిసి ఎర్రకుంట వాగును పరిశీలించారు. ప్రహరీ నిర్మాణంకోసం తవ్వని పునాదిని మట్టిపోసి పూడ్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. వర్షం నీరు ప్రవహించే వాగులు, కాలువలను కబ్జాచేస్తే సహించేది లేదన్నారు. కాలువలు, వాగులు సహజసిద్ధంగా పట్టాభూముల్లో నుంచి ఉన్నా వాటిని వదిలేయాలని చెప్పారు.

సర్వేకు దరఖాస్తు చేశాం

సురంగల్‌ ఎర్రకుంట వాగుకు ఆనుకుని ఉన్న సర్వేనంబర్‌ 332లో 1.01 ఎకరాలు తమ పట్టాభూమి ఉందని.. వర్షాలు పడినప్పుడు వరద వచ్చి తమ పట్టాభూమి కోతకు గురికాకుండా ప్రహరీ నిర్మించడానికి పునాది తీశామని మాజీ సర్పంచ్‌ భర్త, మాజీ ఉపసర్పంచ్‌ గడ్డం అంజిరెడ్డి తెలిపారు. తమ భూమిని సర్వే చేసి హద్దులు చూపించాలని తహసీల్దార్‌కు దరఖాస్తు చేశామని.. సర్వే చేసిన తరువాతే ప్రహరీ నిర్మించుకుంటామన్నారు. అధికారులు త్వరగా సర్వే చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement