కందుకూరు: ఫ్యూచర్‌సిటీకి భూములు ఇచ్చేదేలేదని మండల పరిధిలోని ముచ్చర్ల రైతులు తీర్మానించారు. శనివారం స్థానిక సర్పంచ్ ఊటుపద్మ, ఉప సర్పంచ్ తేరటిరవి, సీనియర్ నాయకుడు ఊటు మహేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ఫార్మా పేరుతో గత ప్రభుత్వం భూములు తీసుకుందని అన్నారు. మళ్లీ అదనంగా తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారని, రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా జీఓ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో 200 మంది రైతులు పట్టా భూములు కోల్పోయే అవకాశం ఉందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే తమకు ఒక్క గుంట భూమి కూడా మిగల్చరా అని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తేరటి లక్ష్మణ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్.రవీందర్, వార్డు సభ్యులు రమేష్, వెంకటేశ్, అశోక్, కృష్ణగౌడ్, చెన్నయ్య, రైతులు శ్రీనివాస్‌రావు, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, శ్రీరాములు, రవి, శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, శేఖర్, హరి, నిరంజన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముచ్చర్ల రైతుల తీర్మానం


