20 రోజుల పాటు పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ ● నలుగురి అరెస్ట్
కంటోన్మెంట్: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును మల్కాజి పోలీసులు ఛేదించారు. నేపాలీ ముఠాకు చెందిన ప్రధాన నిందితులు మీనా, రాజేష్, డేనియల్ చారో, చాంగ్ కిరణ్‌లను అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ తెలిపిన మేరకు.. కౌకూర్‌లో నివాసముంటున్న మురళీ మోహన్ నరసిపురం ఇంట్లో మే 11న రాత్రి దోపిడీ జరిగింది. నేపాలీ కార్మికులు మీనా, రాజేష్‌లు దోపిడీకి పథకం రచించారు. సబీనా అనే మహిళను బాధితుడి ఇంట్లో పనిమనిషిగా చేర్పించారు. మే 11న మీనా పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు వృద్ధ దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఇనుప రాడ్లతో బెదిరించి అల్మారాలు పగులగొట్టి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, 3 వేల అమెరికన్ డాలర్లు సహా విలువైన వస్తువులను దోచుకొని పరారయ్యారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 255 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించి, బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. నేరం జరిగిన ఐదు రోజుల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం మరో 20 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మీనా, రాజేష్‌లు గతంలో పలుచోరీ కేసుల్లో నిందితులని వివరించారు. ఇదిలా ఉండగా కమిషనరేట్ పరిధిలో 1,276 మంది నేపాలీ జాతీయులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


