మృత్యు లోకాలకు | - | Sakshi
Sakshi News home page

మృత్యు లోకాలకు

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

అమ్మమ్మ ఇంటికి వెళ్తూ
రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు మృతి

షాద్‌నగర్‌రూరల్‌: అతివేగం ఇద్దరి ప్రాణాలను హరించిన సంఘటన షాద్‌నగర్‌ పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌కు చెందిన పడకంటి జగదీశ్వర్‌, జయశ్రీ దంపతుల కుమారుడు అఖిల్‌ కుమార్‌(19), అక్కడే ఉండే శంకరయ్య, శామలమ్మ దంపతుల కుమారుడు నవదీప్‌(14) ఇద్దరు స్నేహితులు. శంకరయ్య కొన్నేళ్ల క్రితం వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మందిపాల్‌ గ్రామం నుంచి బతుకుదెరువు నిమిత్తం షాద్‌నగర్‌కు వలస వచ్చారు. ఆయన మేసీ్త్ర పనులు నిర్వహిస్తుండగా, శ్యామలమ్మ శంషాబాద్‌లోని ఆస్పత్రిలోని పని చేస్తూ జగదీశ్వర్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అఖిల్‌కుమార్‌ తన స్నేహితుడు నవదీప్‌తో కలిసి బైక్‌పై అమ్మమ్మ ఊరైన నందిగామ మండలం పిట్టలగూడ గ్రామానికి వెళుతున్నారు. మార్గమధ్యలో లింగారెడ్డిగూడ గ్రామ శివారులో క్రికెట్‌ మైదానం వద్ద రోడ్డు పైకి వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు రహదారిపై పడిపోయారు. అప్పుడే వెనక నుంచి వేగంగా వస్తున్న ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమకు చెందిన బస్సు రోడ్డుపై పడిపోయిన నవదీప్‌, అఖిల్‌కుమార్‌ల పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మిన్నంటిన రోదనలు

అఖిల్‌కుమార్‌ ఇటీవల షాద్‌నగర్‌లో ఇంటర్‌ పూర్తి చేశారు. నవదీప్‌ కొందుర్గు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి మరణంతో ఆస్పత్రి ఆవరణలో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ట్రాఫిక్‌ సీఐ శంకరయ్యతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement