నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
చేవెళ్ల: సిమెంట్ ప్రీకాస్ట్ పలకల తయారీ కేంద్రంగా నిర్వహిస్తున్న అక్రమ దందా గుప్పుమంది. గుట్టుగా గంజాయి మొక్కలు పెంచుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రోడ్డుకు సమీపంలో సిమెంట్ ప్రీకాస్ట్ పలకలు, ఇటుకలు తయారు చేసే కేంద్రంలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో వారు దాడులు చేశారు. అక్కడ బిహార్‌కు చెందిన నగరాజిత్ యాదవ్, దిశేసర్ యాదవ్, లాల్‌బాబు యాదవ్, గణేశ్‌కుమార్ గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. తహసీల్దార్ కృష్ణయ్య, ఏఓ శంకర్‌లాల్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. దాదాపు 3.1 కిలోల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని నలుగురుపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


