సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట జొన్న, మొక్కజొన్న రైతుల పోరాట దీక్ష చేస్తున్నారు. జొన్న, మొక్కజొన్న మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ దీక్షకు దిగారు. పంటల కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన దీక్షకు రైతులు, మహిళలు భారీ స్థాయిలో తరలివచ్చారు. అంబటి మురళి రైతు పోరాట దీక్షలో పాల్గొని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , పోతిన మహేష్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు హాయాంలో పంటలు పండవు, పండినా ధరలు ఉండవు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు. ప్రభుత్వానికి రైతుల బాధలు తెలియజేయడానికే దీక్ష చేస్తున్నారు. మార్క్ ఫెడ్‌ను రంగంలోకి దించాలి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతాంగానికి అండగా ఉండాలంటే రాజకీయ అనుభవం అవసరం లేదు. మనసు ఉంటే చాలు.. అది చంద్రబాబుకు లేదు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం’ అని హెచ్చరించారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘చంద్రబాబుది వ్యవసాయం దండగ అన్న ఆలోచనే. రైతుల ఉత్పత్తులన్నీ దళారుల చేతిలోకి వెళ్తున్నాయి. మొక్కజొన్నను మద్దతు ధర 2400 ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారు. మంత్రే డబ్బులు లేవని అంటున్నారు. చేతకాని దద్దమ్మలా పరిపాలన చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
పోతిన మహేష్ మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రైతులపై దృష్టి పెట్టలేదు. అన్ని వర్గాల ప్రజలకు గ్రహణం పట్టింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. దళారుల వ్యవస్థ నడుస్తుంది. జొన్న, మొక్కజొన్న రైతులకు ఉరి వేస్తున్నారు. ఎక్కడన్నా మద్దతు ధరకు కొనుగోలు చేశారో చూపించాలి. పొన్నూరులో ఎమ్మెల్యేనే దళారిగా మారాడు. సంగం డెయిరీ కోసం దళారుల చేత ఎమ్మెల్యేనే కొనుగోలు చేస్తున్నాడు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాడు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నాడు.
గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ..‘ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలే దళారులుగా మారుతున్నారు. రైతుల కన్నీరుతోనే చంద్రబాబు పాలన చేస్తున్నారు అని మండిపడ్డారు.


