కుటుంబ విలువల గురించి మాట్లాడేది వెన్నుపోటుదారులా?

Mekathoti Sucharitha Comments On Chandrababu Naidu - Sakshi

మహిళలకు జరుగుతున్న మేలును పక్కదారి పట్టించేందుకే డైవర్షన్‌ రాజకీయాలు

రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ధ్వజం

గుంటూరు రూరల్‌: వెన్నుపోటుదారు నాయకత్వంలో పనిచేసేవారు, కుటుంబ విలువలే లేని వ్యక్తులు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం గురించి, ఆయన కుటుంబసభ్యుల గురించి మాట్లాడితే ప్రజలు మరింతగా అసహ్యించుకుంటున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పేరేచర్లలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు కుటుంబ అనుబంధాలు లేవు కాబట్టి, ఎవరికీ ఉండకూడదనుకుంటాడని చెప్పారు. చంద్రబాబుకు చెల్లెళ్ల మీద, తోబుట్టువుల మీద ప్రేమ లేదు కాబట్టి, ఎవరికీ చెల్లెళ్ల మీద ప్రేమలేదని ప్రచారం చేయిస్తాడన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏ స్థాయికి దిగజారతాడో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వందల ఉదాహరణలు దొరుకుతాయన్నారు. అందరూ తనలాగే ప్రవర్తిస్తారని పదేపదే ఆరోపణలు చేయిస్తుంటాడని చెప్పారు.

మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్‌
రాష్ట్రంలో మహిళా సాధికారత ఏంటనేది చేసి చూపించింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న మేలును పక్కదారి పట్టించేందుకు  ముఖ్యమంత్రి జగన్‌ సతీమణి మీద కూడా ప్రతిపక్షం అవాకులు చెవాకులు పేలుతోందన్నారు. జగనన్న సోదరి షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెడితే రాష్ట్రానికి రాకుండా తరిమేశారని నోటికొచ్చినట్లు, అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఒక మహిళగా షర్మిల సొంతగా పార్టీ పెట్టుకుంటే అది తప్పుగా ఎలా అనిపిస్తుందని ప్రశ్నించారు. దాన్ని కూడా రాజకీయం చేయటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలు ఇటువంటి చెత్త రాజకీయాలను తెరపైకి తెస్తున్నాయన్నారు. అలాంటి సీఎం మీద ఆరోపణలు, అసత్యాలు మాట్లాడి నంత మాత్రాన  రాష్ట్ర ప్రజలు వాటిని నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను దాదాపు 1.1 కోట్లమందికిపైగా మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు ఎక్కడ నుంచి అయినా, ఏ ఆపదలో ఉన్నా, సాయం కోరితే తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా, మహిళల జీవితాలతో చెలగాటమాడినందుకే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు, మహిళలు టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top