యంగ్‌ ఇండియా స్కూల్‌ నా బ్రాండ్‌: రేవంత్‌ | CM Revanth Says Young India Is Congress Brand | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా స్కూల్‌ నా బ్రాండ్‌: రేవంత్‌

Apr 10 2025 1:24 PM | Updated on Apr 10 2025 2:55 PM

CM Revanth Says Young India Is Congress Brand

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసులకు యంగ్‌ ఇండియా స్కూల్‌ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్‌ అని అన్నారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే. 16 నెలలైనా బ్రాండ్‌ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్‌ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్‌. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్‌ఇండియా పోలీస్‌ స్కూల్‌కు రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.

ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం అంటే వైఎస్సార్‌ గుర్తుకువస్తారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. యంగ్‌ ఇండియా స్కూల్‌ నా బ్రాండ్‌. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. పోలీసు స్కూల్‌ విషయంలో రాజకీయం లేదు.

వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి.. ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement