గోదావరిఖని: లేబర్‌కోడ్స్ పేరిట దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల వేజ్‌బోర్డు ఆపితే ఊరుకోబోమని ఆలిండియా కోల్‌వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేకే శ్రీవాస్తవ హెచ్చరించారు. స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన తొలిరోజు సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, ఇదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్యలో పెరుగుతూ వస్తోందని అన్నా రు. ప్రభుత్వ రంగసంస్థలన్నింటినీ ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు రంగాన్ని నీరుగార్చుతోందని ధ్వజమెత్తారు. బొగ్గు పరిశ్రమలను రక్షించుకోవాలంటే కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలతో ముందుకు సాగాలని అన్నారు. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా సీఐటీయూ అధ్యక్షుడు సుదీప్‌దత్త, ఉపాధ్యక్షుడు తపన్సేన్‌తోపాటు ఆల్‌ఇండియా కోల్ వర్కర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డీడీ రామానందం, అన్ని కోలిండియా అనుబంధ సంఘాల వ ర్కింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంద నరసింహారావు, తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు పాల్గొన్నారు.


