డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు | birthday celebrations sri vasavi kanyakaparameshwari dublin ireland | Sakshi
Sakshi News home page

డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు

Apr 28 2026 10:59 AM | Updated on Apr 28 2026 11:17 AM

birthday celebrations sri vasavi kanyakaparameshwari dublin ireland

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. 

ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు  దైవిక  కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.

(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)

Advertisement
 
Advertisement
Advertisement