సెలవులకు టాటా.. | - | Sakshi
Sakshi News home page

సెలవులకు టాటా..

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

● ఇక బడిబాట ● రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం ● కొత్త పుస్తకాలు, బ్యాగులతో విద్యార్థుల సందడి ● మానసికంగా సిద్ధంచేస్తున్న తల్లిదండ్రులు ● ముస్తాబవుతున్న విద్యాలయాలు

నిర్మల్‌: వేసవి సెలవులు ముగిశాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో కొత్త విద్యా సంవత్సరంపై ఉత్సాహం నెలకొంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో విద్యార్థులు స్కూల్‌ డేస్‌కు స్వాగతం పలకనున్నా రు. మరోవైపు సెలవుల్లో ఎంజాయ్‌ చేసిన తమ పిల్లలను క్రమంగా చదువుల వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులు మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. తమ మదిలో దాచుకున్న సెలవుల జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకోవడానికి, కొత్త స్నేహితులు ఎవరవుతారోనని విద్యార్థులూ ఆతృతగా ఉన్నారు.

జాలీగా హాలీడేస్‌..

విద్యార్థి జీవితంలో అత్యంత ఇష్టమైనవి వేసవి సెలవులు. ఈ సెలవులు ఆటలు, అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు ప్రయాణాలు, శుభకార్యాలు, బంధువుల ఇళ్ల సందర్శనలు, విహారయాత్రలు ఇలా జాలీగా గడిచిపోయాయి. చాలామంది చిన్నారులు ఈ వే సవిని వృథా చేయకుండా డ్రాయింగ్‌, కరాటే, షటిల్‌ బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, భరతనాట్యం తదితర ఆటపాటలను నేర్చుకున్నారు.

సిద్ధమవుతున్న స్కూళ్లు..

ఉపాధ్యాయులు కూడా కొత్త విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పాఠశాలల్లో తరగతి గదుల పరిశుభ్రత, బెంచీలు, బ్లాక్‌బోర్డులు, తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికే బడిబాట పూర్తిచేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజు విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. కొత్తగా ఒకటో తరగతిలో చేరే చిన్నారులకు ఇది జీవితంలో తొలి విద్యాప్రయాణం. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. ఉన్నత తరగతులకు వెళ్లే విద్యార్థులు కూడా కొత్త సిలబస్‌, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఉత్సాహంగా.. ప్రశాంతంగా..

రెండు నెలల సెలవుల తర్వాత ఒక్కసారిగా చదువుల ఒత్తిడిలోకి వెళ్లకుండా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ఉత్సాహంగా, ప్రశాంతంగా మొదలుపెట్టేలా చేయాలని సూచిస్తున్నారు. సమయపాలన, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

కొత్త బ్యాగులు, పుస్తకాలు..

సెలవుల్లో హాయిగా గడిపిన చిన్నారులు ఇప్పుడు మళ్లీ చదువుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం కొత్త బ్యాగులు, యూనిఫాంలు, షూస్‌, నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాల సందడి నెలకొంది. విద్యాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లూ కిటకిటలాడుతున్నాయి. హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకు అవసరమైన సామగ్రిని సమకూర్చడంలో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. చాలావరకు ప్రైవేటుస్కూళ్లు పుస్తకాలు విక్రయిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement