భైంసాటౌన్: జిల్లాలో హార్డ్‌వేర్ జీరో దందా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం భవన నిర్మాణ రంగం పనులు జోరుగా సాగుతుండడంతో ఐరన్, సిమెంట్‌కు గిరాకీ పెరిగింది. అయితే, కొందరు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా రూ.కోట్లాది విలువైన సరుకును జీరోలో కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర జిల్లాకు సరిహద్దుగా ఉండడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి జీరోలో సరుకులు సరఫరా అవుతున్నాయి. స్థానిక వ్యాపారులు సైతం పన్నులు తప్పించుకునేందుకు జీరోలో సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే సరి.. లేదంటే అంతే సంగతి అన్నచందంగా మారింది. ముఖ్యంగా నిర్మాణ రంగ సామగ్రి జీరోలో భారీగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఖాళీగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు..
జీఎస్టీ ఏర్పాటు తరువాత కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు పనిలేకుండా పోయింది. జిల్లాలో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, నిబంధనలు ఏ మేరకు అమలవుతున్నాయి.. ప్రభుత్వానికి సక్రమంగా ట్యాక్స్ చెల్లింపులు జరుగుతున్నాయా.. అనే విషయాలపై సరిగా దృష్టి పెట్టడం లేదు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
అక్రమంగా ఐరన్ వ్యాపారం..
నిర్మాణ రంగానికి సంబంధించి జిల్లాలో ఐరన్ దందా జీరోలో సాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో ఓ ఐరన్ లోడ్ లారీ పట్టుబడడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా భైంసా పట్టణ కేంద్రంలో పలువురు హార్డ్‌వేర్ వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జీరోలో స్టీల్ రాడ్ దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని జాల్నా నుంచి ఎక్కువ మొత్తంలో ఐరన్ అక్రమంగా తీసుకొచ్చి, స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇలా జీరో దందా నిర్వహిస్తున్న వ్యాపారులు ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. హార్డ్‌వేర్ దుకాణాలే కాకుండా ఇతరత్రా వ్యాపారులు సైతం ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో జీరోలో సరుకులు తెప్పించుకుంటూ పన్నులు ఎగ్గొడుతున్నారు.
అక్రమ దందా నిర్వహిస్తే చర్యలు..
బిల్లులు లేకుండా సరుకులు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్ను ఎగవేయడం చట్టరీత్యా నేరం. వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా సరుకులు దిగుమతి చేసుకుంటే పన్నుతోపాటు వందశాతం జరిమానా విధిస్తాం.
– ఈశ్వర్, కమర్షియల్ ట్యాక్స్ అధికారి, నిర్మల్


