నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణంలో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, కూచాడి సత్యమ్మ ప్రకాశ్‌రావు కంటి పరీక్ష కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్యం అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రారంభ దశలోనే కంటి సంబంధిత సమస్యలను గుర్తించి తగిన వైద్యం పొందవచ్చన్నారు. క్లిష్టతరమైన నేత్ర సమస్యలు ఉన్నవారు హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిపుణుల సేవలను పొందేలా ఈ కేంద్రం వారధిగా పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో ఇటువంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో కూచాడి శ్రీహరిరావు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
నర్సారెడ్డి చిరస్మరణీయుడు
ప్రజాసేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిస్వార్థంగా పనిచేసిన మహానేత పొద్దుటూరి నర్సారెడ్డి అని, ఆయన చిరస్మరణీయుడని, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఇటీవల ఏర్పాటు చేసిన పి.నర్సారెడ్డి విగ్రహానికి శనివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నర్సారెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జీవించిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.


