భైంసా: బాసరలో కేంద్రీయ విద్యాలయం(కేవీ) ఏ ర్పాటు.. దేవుడు వరమిచ్చినా పూజారి కరునించని చందంగా మారింది. ఈ విద్యా సంవత్సరం కచ్చి తంగా ప్రారంభమవుతుందని జిల్లావాసులు, తల్లి దండ్రులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ‘సారీ’ నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని బాసరకు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన స్థలం ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. అయినా ఇప్పటివరకు పాఠశాల ప్రారంభానికి అవసరమైన చర్యలు కనిపించడం లేదు. ఈ విద్యా సంవత్సరం కూడా కేవీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రముఖ పుణ్యక్షేత్రం..
బాసరలో ఇప్పటికే దేశ ప్రఖ్యాతి గాంచిన సరస్వతి ఆలయం, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ) వంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వస్తే స్థానిక విద్యార్థులతోపాటు ఆర్‌జీయూకేటీ సిబ్బంది, కేంద్ర సంస్థల ఉద్యోగుల పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది.
దస్త్రాల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్..
మరోవైపు గతంలో బాసరలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రతిపాదన కూడా ఫైళ్లకే పరిమితమైంది. కేంద్రీయ విద్యాలయం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ రెండింటి విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం
చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కేంద్రీయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంగ్లిష్ మాధ్యమంతోపాటు జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, పోటీ పరీక్షలకు అనుకూలమైన బోధన అందుబాటులో ఉంటుంది. అలాంటి అవకాశం బాసర విద్యార్థులకు దక్కకుండా పోతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కేవీ ఏర్పాటు ప్రస్తుతం ఏ దశలో ప్రక్రియ ఉందో అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
కేంద్ర మంత్రి పరిశీలనలో ప్రతిపాదనలు..
కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలనలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 47 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని విద్యాలయాలకు సంబంధించి స్థల సేకరణ, అక్కడి భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ వ్యవస్థ వంటి అన్ని వివరాలను పలు రాష్ట్రాలు పంపించాయి. ఇప్పటికే సంబంధిత అధికారులు పరిశీలన కోసం క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చారు. కేంద్రం అనుమతి వస్తే తరగతులు ప్రారంభం అవుతాయి.
ఏళ్లుగా డిమాండ్..
బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజలు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కేవీకి ఆమోదం తెలిపింది. అనంతరం పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. శాశ్వత భవనాల నిర్మాణానికి సమయం పట్టే నేపథ్యంలో మొదట్లో అద్దె భవనాల్లోనే తరగతులు ప్రారంభించడం ఆనవాయితీ. కానీ బాసర విషయంలో అలాంటి చర్యలు కూడా కనిపించకపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాత్కాలిక భవనంలో అయినా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్థలం పరిశీలన..
కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి బాసరలో రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాసరలోని సర్వే నంబర్ 4లో కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఉందని తెలిపారు. ఈ సర్వే నంబర్‌లో 28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అప్పటి భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి అధికారులకు నివేదిక ఇచ్చారు. ఆ స్థలంలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. ఈ స్థలంలోనే శాశ్వత భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాసరలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే బాసరలో ఈ ఏడు తరగతులు ప్రారంభమవుతాయి.


