ఖానాపూర్/పెంబి: ఆధునిక సాంకేతికత దూసుకుపోతున్నా.. జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజల జీవనం మాత్రం ఇంకా దశాబ్దాలు వెనుకబడి ఉంది. రవాణా సౌకర్యాలు లేక ఆదివాసీలు రోజురోజుకూ ప్రాణాలు పణంగా పెట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఐటీడీఏ కార్యాలయం ఉన్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించే నాథుడు లేడని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగి వెళ్తారని, తర్వాత కన్నెత్తి చూడరని వాపోతున్నారు.
ఎడ్లబండిలోనే ప్రసవం..
మే 29న పెంబి మండలం దోందరి గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ తోడం సునీతకు తెల్లవారు జామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా, రోడ్డు సౌకర్యం లేక గ్రామానికి 10 కి.మీ. దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో తీసుకుని బయల్దేరారు. అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే సునీత ప్రసవించింది. ఈ సంఘటన గిరిజన గ్రామాల్లోని రవాణా దుస్థితిని బయటపెట్టింది.
అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి..
పెంబి మండలం పస్పుల, తులసిపేట, యాపల్‌గూడ, వస్‌పల్లి, దోందరి, గుమ్మేన, వెంకంపోచంపాడ్, రామ్‌నగర్, సత్తుగూడ, అర్చనతండా గ్రామాలు, ఖానాపూర్ మండలం ఎర్వచింతల, కోలాంగూడ, రాజురా తదితర గ్రామాల్లో ఇదే సమస్య తీవ్రంగా కొనసాగుతోంది. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే కడెం, దోత్తి వాగులు, వంకలు దాటాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే రోజుల తరబడి గ్రామాలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాయి.
కలగానే వంతెనలు..
2021లో వచ్చిన భారీ వరదల్లో పస్పుల–అర్చనతండా మధ్య కడెం వాగుపైని వంతెన కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు పునర్నిర్మాణం జరగలేదు. యాపల్‌గూడ–కోసగుట్ట మధ్య దోత్తి వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా అటవీ అనుమతుల పేరుతో పనులు నిలిచిపోయాయి. పెంబి మండలంలోని అంకెన, రాయదారి, పోచంపల్లి, గోదుమలపైన, గోదుమల క్రింద, కర్ణంలోద్ది గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కడెం వాగు దాటాల్సి ఉంటుంది. లేదంటే ఖానాపూర్ మీదుగా 80 కిలోమీటర్ల చుట్టుప్రయాణం చేయాల్సి వస్తోంది.
అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని..
రేషన్, పెన్షన్, వైద్యం, విద్య కోసం కూడా వాగులు, వంకలు దాటి సుదూర ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. సరైన రహదారులు, వంతెనలు, విద్యుత్, వైద్య సౌకర్యాలు లేక గిరిజనులు ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకుండా జీవితం సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాలకు రహదారులు, వంతెనలు, వైద్యం, విద్యుత్ సౌకర్యాలు కల్పించి దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


