● కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి, గోదాములకు తరలించినట్లు తెలిపారు. 1.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించామని వివరించారు. 30 వేల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడి రాగా, ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. మిగిలిన ధాన్యాన్ని మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. అధికారుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలిగామన్నారు. వానా కాలానికి సంబంధించి రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 10,734 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు వారి అవసరాన్ని బట్టి యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలన్నారు. ప్రతీ ఎరువుల దుకాణం వద్ద ప్రత్యేకంగా ఒక పోస్టరు ఏర్పాటు చేయాలని తెలిపారు. అందులో ఎరువుల ధరలు, తదితర వివరాలు ప్రదర్శించబడతాయన్నారు. రైతుల వద్ద ఎరువుల కోసం అధిక ధరలు వసూలు చేస్తే, 8977751754 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈనెల 26 నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతున్నందున, ప్రజలకు ఈ ప్రక్రియపై మీడియా మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, మార్క్ ఫెడ్ డీఎం మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి రమణ పాల్గొన్నారు.


