కుంటాల:కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య పరిష్కరించేందుకు, భూగర్భ జలాల వృద్ధి కోసం ఉపాధి నిధులను వెచ్చించి ‘కమ్యూనిటీ మ్యాజిక్ డ్రైన్’ నిర్మాణాలు చేపడుతోంది. కుంటాల మండలం సూర్యపూర్ గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేపట్టారు. మురుగునీరు, వర్షపు నీరు తక్కువ ఖర్చుతో నేలలో ఇంకేలా ఈ నిర్మాణం రూపొందించారు. భవిష్యత్తులో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఉద్దేశం ఇదీ..
మురుగునీరు నిల్వ కాకుండా, రోడ్లపై చేరకుండా, ప్రజారోగ్య సమస్యలను నివారించేందుకు ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ వ్యవస్థతో తక్కువ నీటితోనే మురుగునీటి నిర్వహణ సాధ్యమవుతుంది.
నిర్మాణ పద్ధతి..
గ్రామంలో వీధుల నుంచి వచ్చే మురుగునీరు ఒకే చోట చేరే స్థలంలో ఈ గుంతను నిర్మిస్తారు. మొదట 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 5 నుంచి 6 అడుగుల లోతు గల గుంతను తవ్వుతారు. నీరు క్రమంగా ఇంకేలా గుంతలో వివిధ రకాల పదార్థాలను పొరలు పొరలుగా వేయాలి. మొదట పెద్ద రాళ్లు, షాబాద్ బండలను అమర్చాలి. దాని పైన చిన్న కంకర సైజు చిప్స్ (10 ఎంఎం రాళ్లు), ఆ తర్వాత ఇసుకను వేయాలి. మురుగునీరు నేరుగా గుంతలోకి వెళ్లేలా మధ్యలో రంధ్రాలు ఉన్న సిమెంట్ పైపును అమర్చుతారు. ఈ పైపు నీటిలోని మట్టి, చెత్త వంటి సిల్ట్‌ను ఆపి, కేవలం నీటిని మాత్రమే చుట్టూ ఉన్న రాళ్ల పొరల్లోకి పంపుతుంది. గుంత పైభాగాన మట్టి లేదా కాంక్రీట్ మూతతో కప్పి ఉంచుతారు. దీంతో మురికి వాసన రాకుండా, గుంత ఉన్నట్లు బయటికి కనిపించకుండా ఉంటుంది.
ప్రయోజనాలు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాయి. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచేందుకు అనుకూలంగా ఉంటాయి. ప్రతీ 100 మీటర్ల నిర్మాణానికి తప్పనిసరిగా మూడు ఇంకుడు గుంతలు నిర్మించాలి. ఇందుకు సుమారు రూ. 90 వేలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. మురుగునీరు శుద్ధి అయి నేరుగా భూగర్భంలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది. గ్రామ పంచాయతీకి మురుగు కాలువలను శుభ్రపరిచే భారం తగ్గుతుంది. దోమలు పెరగవు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా అరికట్టవచ్చు.


