ప్లాస్టిక్‌ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత సమాజమే లక్ష్యం

Jun 12 2026 6:15 AM | Updated on Jun 12 2026 6:15 AM

నిర్మల్‌ రూరల్‌:ప్లాస్టిక్‌ రహిత సమాజమే లక్ష్యమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టాలను వివరించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా బట్ట సంచులు, స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌, స్టీల్‌ లంచ్‌ బాక్సులు వాడాలని, భోజనం కోసం మోదుగ లేదా అరటి విస్తర్లను ఉపయోగించడం ఉత్తమమని సూచించారు. జిల్లా పర్యావరణ విద్య అంబాసిడర్‌, నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ కోఆర్డినేటర్‌ డి.మోహన్‌రావు మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పర్యావరణ హిత వస్తువులపై ప్రచారోద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హిత వస్తువులతో సెల్ఫీ దిగి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, తడి–పొడి చెత్తను శాసీ్త్రయంగా వేరుచేయడంపై అవగాహన కల్పించారు. చెత్త ఉత్పత్తి అయ్యే చోటనే నాలుగు రకాలుగా విభజించడం ద్వారా కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని తెలిపారు. అనంతరం ’ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ (తల్లి పేరుతో ఒక మొక్క) నినాదంతో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, కళాశాల ఎకో క్లబ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌, దోస్త్‌ కోఆర్డినేటర్‌ కుంటా శ్రీహరి, పీజీ.రెడ్డి, రమేశ్‌రెడ్డి, రజిత, ఉమేశ్‌, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement