లక్ష్మణచాంద: రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా వ్యాపారులను ఆదేశించారు. సోన్ మండల కేంద్రంలోని బాలకిషన్ ఫర్టిలైజర్ షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల స్టాక్, విక్రయాల రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లలోని వివరాలను ఆన్‌లైన్ వివరాలతో పోల్చి చూశారు. పలు కంపెనీ ల విత్తనాల లేబుళ్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలన్నారు. నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ వసూలు చేయొద్దని సూచించారు. రైతులు కొనుగోలు చేసినవాటికి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, నకిలీవి అమ్మినా, అధిక ధరలు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డీసీఎంఎస్ రైతు సేవాకేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఏవో అంజి ప్రసాద్, తహసీల్దార్ సంతోష్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు.


