కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం | Woman Found Dead Under Suspicious Circumstances In Bengaluru Rental Home, Police Probe Underway | Sakshi
Sakshi News home page

కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం

Apr 29 2026 12:15 PM | Updated on Apr 29 2026 12:24 PM

Woman found dead in locked Bengaluru flat

బొమ్మనహళ్లి: బెంగళూరులో మంగళవారం ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. అడుగోడిలో అద్దె ఇంట్లో పూజ దత్తా (34) అనే యువతి నగ్న స్థితిలో శవమై తేలింది. మొదట్లో హత్య అనుకున్నా, తరువాత ఆత్మహత్య అని అనుమానాలు బలపడ్డాయి.  వివరాలు... జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన పూజ దత్తా గత మూడేళ్లుగా అదే ఇంట్లో నివసిస్తూ ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థలో పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందటే ఉద్యోగం వదిలేసిందని తెలుస్తోంది. 

మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఇంట్లోంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇంటి యజమాని తలుపు పగలగొట్టి చూడగా, పూజ మృతదేహం దాదాపు కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె ఎవరితోను మాట్లాడేది కాదు, తరచుగా ఒంటరిగా రోడ్డుపై తిరిగేదని స్థానికులు తెలిపారు. ఆమె మానసికంగా కుంగిపోయినట్లు కనిపించిందని చెప్పారు. ఒక యువకుడు బైక్‌లో పూజ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడని చెప్పారు. ఆమె ఫోన్‌ స్విచాఫ్‌లో ఉండగా, కాల్‌ డీటైల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టారు.
   
ఇల్లంతా చెత్త చెత్త 
ఆమె ఇల్లంతా చెత్తకుప్పలా ఉంది. గోడపై రకరకాల రాతలు రాసి ఉన్న పేపర్లు అతికించి ఉన్నాయి. అవి ఆంగ్లం, హిందీ భాషల్లో ఉన్నాయి. ఒక గది మొత్తం చెత్తతో, చిరిగిన కాగితాలతో నిండి ఉంది. ఇంట్లో సుమారు  ఐదారు పాత కాగితాల కట్టలు దొరికాయి. ఆమె మానసిక స్థితి సరిగా లేదా అనేది సందేహంగా ఉంది. పోస్టమార్టం నివేదిక వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement