అత్యాచార బాధిత బాలిక గర్భ విచ్ఛిత్తిపై కేంద్రానికి సుప్రీం సూచన
న్యూఢిల్లీ: అత్యాచార బాధిత బాలికల గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మైనర్‌ను గర్భాన్ని మోయాలంటూ బలవంతం చేయజాలమని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం.. బాధిత మైనర్ తన అవాంఛిత గర్భాన్ని 20 వారాలు దాటిన తర్వాత సైతం తొలగించుకునేందుకు అనుమతించేలా చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం వెలువరించిన ఈ నిర్ణయం అత్యాచార బాధితులు, ముఖ్యంగా చిన్నారుల ప్రాథమిక హక్కుల విషయంలో ఒక మైలురాయిగా మారనుంది. 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తొలగించాలంటూ ఏప్రిల్ 24వ తేదీన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఎయిమ్స్‌ను ఆదేశించడం తెల్సిందే. దీనిపై ఎయిమ్స్ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఎయిమ్స్ వినతిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణామం చెందేలా చట్టాలు ఉండాలి. అత్యాచారం వంటి కారణాలతో గర్భం దాల్చినప్పుడు, దాన్ని తొలగించుకునేందుకు సమయ పరిమితి విధించడం సరికాదు. ఆ మేరకు చట్ట సవరణ చేయండి. ఇటువంటి కేసుల విచారణను వారంలోపే పూర్తి చేసేలా మార్పులు చేపట్టండి. విచారణ ఆలస్యంతో కలిగే మానసిక వేదనను ఆ చిన్నారి ఎందుకు అనుభవించాలి?’అని సీజేఐ ప్రశ్నించారు.
ఎయిమ్స్ వాదనను ఖండించిన ధర్మాసనం
ఇది చిన్నారికి, లోపలున్న పిండానికి సంబంధించిన సమస్య కాదని, చిన్నారికి మరో చిన్నారికి సంబంధించిన అంశమని ఎయిమ్స్ తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ‘ఇప్పటికే 30 వారాలు గడిచాయి కాబట్టి, గర్భస్థ శిశువు స్వతంత్రంగా జీవించగలిగే స్థితిలో ఉన్న ప్రాణం. ఒకవేళ ఇప్పుడు గర్భస్రావం చేస్తే, అది తీవ్ర వైకల్యాలతో కూడిన సజీవ శిశువు అవుతుంది. మరోవైపు, మైనర్ అయిన ఆ తల్లి జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆమె తిరిగి గర్భం దాల్చే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు’అని భాటి వివరించారు.
స్పందించిన ధర్మాసనం..‘అన్ని వివరాలను బాలిక తల్లిదండ్రులకు చూపించండి. వారు ఆ గర్భాన్ని ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే, అలాగే కానివ్వండి. ఆ చిన్నారి మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వారు భావిస్తే, నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వండి. వారే క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. ఒక సైకియాట్రిస్ట్‌ను, కౌన్సెలర్‌ను వారితో మాట్లాడించండి. అంతిమ నిర్ణయం వారిదే కావాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరుల తరపున నిర్ణయాలు తీసుకోవడం ఎయిమ్స్ పని కాదని, వారు కేవలం వైద్య సేవలు మాత్రమే అందించాలని తేల్చిచెప్పింది.
స్కూలుకెళ్లే వయస్సు..
‘ఇది చిన్నారిపై జరిగిన అత్యాచార ఉదంతం. గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వకపోతే, ఆ బాధితురాలి మనసుపై జీవితాంతం ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది. ఆ చిన్నారికి ఎటువంటి శాశ్వత శారీరక వైకల్యం కలగనంత వరకు, గర్భస్రావం చేపట్టాల్సిందే. ఇష్టం లేని గర్భాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఆమె ఒక చిన్నపిల్ల. స్కూలుకెళ్లి చదువుకోవాల్సిన వయస్సులో మనం ఆమెను తల్లిని చేయాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ చిన్నారి అనుభవిస్తున్న బాధను, అవమానాన్ని ఒక్కసారి ఊహించండి’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.


