ఢిల్లీ: దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను కేంద్రం ఇవాళ(ఏప్రిల్ 16, గురువారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని సభలో ప్రసంగిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయ రంగు పులమొద్దన్నారు.
‘‘దేశ ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ అందరికీ దక్కుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి నష్టపోవద్దు. క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వం సిద్ధంగా ఉంది. నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారంతా భావిస్తున్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత నాది. బీసీ వర్గాల్లో జన్మించిన నాకు ప్రధాని పదవి దక్కడం రాజ్యాంగ నిర్మాతల చలవే.
..డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. గ్యారెంటీగా అంశాన్ని ఈ విషయాన్ని చెపుతున్నా. ఇప్పుడున్న నిష్పత్తిలో నియోజకవర్గాల్లో పెరుగుతాయి. మా విధానాల్లో స్పష్టత ఉంది. గతంలో జరిగిన మహిళలకు జరిగిన వివక్ష అనే పాపాన్ని కడిగేస్తున్నాం. సాంకేతిక అంశాలతో వ్యతిరేకించొద్దు. బిల్లును ఎలాగా ఆమోదించాలో సమయం నిర్ణయిస్తుంది. మూడు దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. “దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో, వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం.
..మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకూ బాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు" అని మోదీ వ్యాఖ్యానించారు.

“ఈ బిల్లును తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం మాకు లేదు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం” అని మోదీ స్పష్టం చేశారు.
ఈ బిల్లుతో కేవలం దేశంలోని మహిళలకు వారి హక్కులను కల్పిస్తున్నాం. ఈ బిల్లుపై క్రెడిట్ నాకు అవసరం లేదు. మీరే (విపక్షాలను ఉద్దేశిస్తూ) తీసుకోండి.. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫొటోలూ వేసుకోండి. ఈ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దాం” అని మోదీ విపక్షాలను కోరారు.


