సీఈసీ ఉద్వాసన కోరుతూ విపక్షాల తాజా నోటీస్‌ | Opposition parties submitted a Rajya Sabha notice seeking removal of CEC | Sakshi
Sakshi News home page

సీఈసీ ఉద్వాసన కోరుతూ విపక్షాల తాజా నోటీస్‌

Apr 25 2026 5:00 AM | Updated on Apr 25 2026 5:00 AM

Opposition parties submitted a Rajya Sabha notice seeking removal of CEC

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) పదవి నుంచి జ్ఞానేశ్‌ కుమార్‌ను తప్పించాలంటూ విపక్ష పార్టీలు శుక్రవారం తాజాగా మరో నోటీస్‌ను రాజ్యసభకు అందజేశాయి. సీఈసీ ఉద్వాసనకు సంబంధించి తీర్మానం కోసం నోటీస్‌ ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు సాగరికా ఘోష్‌ రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. 

వీలైనంత త్వరగా సీఈసీ ఉద్వాసనకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మునుద్దేశిస్తూ నేతలు నోటీస్‌ను అందజేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను ప్రభావితంచేసేలా ప్రధాని మోదీ ఏప్రిల్‌ 18వ తేదీన సందర్భంలేకపోయినా ఉద్దేశపూర్వకంగా జాతినుద్దేశించి ప్రసంగించారని, ఈ విషయమై ఫిర్యాదుచేసినా సీఈసీ పట్టించుకోలేదని నోటీస్‌లో ప్రస్తావించారు. 

వృత్తిధర్మం నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమవడంతోపాటు అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నారని ఆ నోటీస్‌లో నేతలు పేర్కొన్నారు. నోటీస్‌పై 73 మంది విపక్షసభ్యులు సంతకాలుచేశారు. 2026 మార్చి 15వ తేదీన, ఆ తర్వాత సైతం సీఈసీ జ్ఞానేశ్‌ చర్యలు ఆయనలోని పక్షపాత ధోరణిని పలుమార్లు బయటపెట్టాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(5), ఆర్టికల్‌124(4), సీఈసీ, ఇతర ఈసీల (నియామక, సర్వీస్‌ నిబంధనల)చట్టం,2023లోని 11(2)వ సెక్షన్, జడ్జీల(విచారణ)చట్టం–168లోని నిబంధనలకు పూర్తివిరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై మొత్తంగా 9 ప్రధాన ఆరోపణలున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement