బెంగళూరు: మంచు కొండలు, గలగలపారే సెలయేర్లు, ఆకాశాన్నంటే మంచు పర్వతాలు, ఆహ్లాద వాతావరణంతో కూడిన జమ్మూ కాశ్మీర్ లో పర్యటనకు వెళ్దామంటే ఆమె సంతోషపడింది. కానీ ఆ యాత్ర తన జీవితంలో అంతులేని చీకట్లను నింపుతుందని ఊహించలేకపోయింది. భర్తను పోగొట్టుకుని జీవితం దుఃఖభరితమైంది. పహల్గాంలో యాత్రికులపై పాక్ ముష్కర ఉగ్రవాదుల దాడి జరిగి ఏడాది అవుతోంది, బెంగళూరుకు చెందిన టెక్కీ భరత్ భూషణ్.. ఉగ్రవాదుల తుపాకులకు బలయ్యాడు. ఆయన కుటుంబంలో విషాదకరమైన మౌనం నెలకొంది.
భవిష్యత్తుపై ఎన్నో కలలు
ఏడాది కిందటి దుర్ఘటనను తలచుకుని భరత్ భూషణ్ (41) సతీమణి, తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. పహల్గాం భైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల రక్తపాతానికి అనేకమంది అమాయక పర్యాటకులు ప్రాణాలు విడిచారు. ఈ దురాగతానికి భారత దేశం ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రతీకారం తీర్చుకోవడమైనది. ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన బెంగళూరులోని మత్తికెరెకు చెందిన భరత్ భూషణ్ జ్ఞాపకాలతో ఆయన సతీమణి డాక్టర్ సుజాత, చిన్నారి కుమారుడు జీవిస్తున్నారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్నామని ఆమె, తల్లిదండ్రులు తెలిపారు. రోజువారీ పనుల మధ్య చేదు జ్ఞాపకాలను మరవటానికి డాక్టర్ సుజాత ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఆ ఘోరమైన రోజు కళ్లముందే వచ్చి నిలబడుతుంది. ఆత్మయున్ని కోల్పోయిన బాధ మరువడం సాధ్యం కావడం లేదు.
ఈ ఘోరాలకు అంతమెన్నడు?
ఒక సంవత్సరం అయినట్లే తెలియడం లేదు, నిన్ననో, మొన్ననో నా భర్త చెంతనే ఉన్నాడు అనిపించేలా జ్ఞాపకాలు నెలకొన్నాయి. వాస్తవం కొంతసేపటికే అర్థమై జీవితం భారంగా గడుస్తోంది. ఉగ్రమూకలు సరిహద్దులు దాటి వచ్చి ఘోరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇది ఎప్పుడు ముగుస్తుందో అప్పుడే క్షేమంగా ఉంటామని చెప్పవచ్చు. సేఫ్‌గా ఉందనే మేము కాశ్మీర్ కు వెళ్లాము. కానీ నమ్మకం లేకుండాపోయింది. జీవితంలో ఆశలు ఉండేవి. ఉగ్రవాదులు అక్కడ పనిచేసేవారి తరహా దుస్తుల్లో నడుచుకుంటూ వచ్చారు, గన్ తీసి షూట్ చేశారు అని డా.సుజాత కన్నీటితో గుర్తుచేసుకున్నారు. టూరిస్టులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.


