డీలిమిటేషన్‌ దంగల్‌కు... రంగం సిద్ధం! | Narendra Modi Govt introduced all three bills in Lok Sabha | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ దంగల్‌కు... రంగం సిద్ధం!

Apr 17 2026 1:33 AM | Updated on Apr 17 2026 8:33 AM

Narendra Modi Govt introduced all three bills in Lok Sabha

లోక్‌సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్‌ అంశాలపై మాట్లాడుతున్న ప్రధాని మోదీ

మహిళా బిల్లుపై లోక్‌సభలో నేడే ఓటింగ్‌ 

ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి..  మోదీ సర్కారు ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ 

రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు 

డివిజన్‌ అనంతరం చర్చకు స్వీకరించిన లోక్‌సభ 

మరో రెండు బిల్లులను కూడా ప్రవేశపెట్టిన కేంద్రం 

అర్ధరాత్రి దాకా చర్చ; అధికార– విపక్షాల వాగ్యుద్ధం

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమలు చేసేందుకు మోదీ సర్కారు తలపెట్టిన కీలక కసరత్తు నిర్ణాయక దశకు చేరింది. రిజర్వేషన్ల చట్టం సత్వర అమలు, అందుకు వీలుగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్‌ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లు–2026ను కేంద్రం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాటి డిమాండ్‌ మేరకు ఈ అంశంపై డివిజన్‌ (ఓటింగ్‌)కు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుకు అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. అనంతరం మూడు బిల్లులనూ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 

లోక్‌సభ నిబంధన 66లోని ప్రొవైజోను సస్పెండ్‌ చేసి డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులను ఒకేసారి పరిశీలించి ఆమోదించేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లులు రాజ్యాంగ సవరణతో ముడిపడ్డాయి గనుక ఇందుకు అనుమతించాలని కోరారు. స్పీకర్‌ అనుమతితో బిల్లులపై మొదలైన చర్చ గురువారం అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా సాగింది. బిల్లుకు అనుకూలంగా అధికార, వ్యతిరేకంగా విపక్ష సభ్యుల వాదనలతో సభ హోరెత్తిపోయింది. బిల్లులపై ఓటింగ్‌కు శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ముహూర్తం ఖరారైంది. వాటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. మోదీ సర్కారుకు అందుకు అవసరమైన సంఖ్యా బలం లేని నేపథ్యంలో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో ఓటింగ్‌పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

హోరాహోరీ వాదనలు 
పార్లమెంటు మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం లోక్‌సభ సమావేశం మొదలవగానే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిపై 40 నిమిషాల పాటు తీవ్ర చర్చ జరిగింది. చివరికి డివిజన్‌ ఓటింగ్‌ అనంతరం సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్‌ బిల్లును మేఘ్వాల్‌ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లును హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. తర్వాత చర్చను ప్రారంభించిన కాంగ్రెస్‌ సభ్యుడు గౌరవ్‌ గొగొయ్‌ మోదీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్‌సభ స్థానాలను అడ్డదిడ్డంగా పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ అసలు లక్ష్యమంటూ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల నిమిత్తం పార్లమెంటు గతంలోనే చట్టం చేశాక మళ్లీ దానికి మార్పులను ప్రతిపాదించడం వెనక మతలబు ఏమిటని కాంగ్రెస్‌ సభ్యుడు కె.సి.వేణుగోపాల్‌ కేంద్రాన్ని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఇతర బిల్లులతో కలిపి చర్చకు చేపట్టరాదంటూ అభ్యంతరం వెలిబుచ్చగా దాన్ని అమిత్‌ షా తోసిపుచ్చారు. ఒకే అంశానికి సంబంధించిన పక్షంలో వాటిని ఉమ్మడిగా చర్చకు చేపట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయని స్పీకర్‌ బిర్లా స్పష్టం చేశారు. 

ప్రజాస్వామ్యానికి అంతమే! 
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు రూపంలో దేశ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు బాహాటంగా దాడికి దిగిందని కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రియాంకా గాంధీ వద్రా దుయ్యబట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యమే పూర్తిగా అంతమైపోతుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత 543 సీట్లకే మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయడంలో కేంద్రానికి ఇబ్బందేమిటని ఆమె నిలదీశారు. సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వేణుగోపాల్‌ ఆరోపించారు. వాటి విషయంలో ఇంత హడావుడి ఎందుకని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేస్తూనే, జనగణన జరుగుతుండగానే ఈ హడావుడి కసరత్తు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. బిల్లు ఉద్దేశాలను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్షిప్తంగా ప్రసంగించారు. 

2029 లోక్‌సభ ఎన్నికల నాటికి కూడా మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే వారికి తీరని నష్టం జరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగబోదని స్పష్టం చేశారు. ‘‘బిల్లును వ్యతిరేకించే పార్టీలు పూడ్చుకోలేని విధంగా నష్టపోవడం ఖాయం. అది మాకే లబ్ధి చేకూరుస్తుంది’’ అని అన్నారు. అనంతరం విపక్షాల ప్రసంగాల మధ్యలో అమిత్‌ షా అప్పుడప్పుడూ జోక్యం చేసుకుంటూ వాటి వాదనలను తిప్పికొడుతూ వచ్చారు. డీలిమిటేషన్‌ అనంతరం దక్షిణాది రాష్ట్రాల బలం ఇప్పటితో పోలిస్తే మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదని సోదాహరణంగా వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక కూడా పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి అన్యాయమూ జరగొద్దనే లోక్‌సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం మేరకు పెంచుతున్నట్టు వెల్లడించారు. 



నల్ల దుస్తులతో డీఎంకే 
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు నల్ల దుస్తులతో సభకు హాజరయ్యారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆ పార్టీ సభ్యుడు టి.ఆర్‌.బాలు డిమాండ్‌ చేశారు. ప్రతిపాదత బిల్లుల అసలు లక్ష్యం డీలిమిటేషనే తప్ప మహిళా రిజర్వేషన్ల అమలు కాదని ఆరోపించారు. కె.సుబ్బరాయన్‌ (సీపీఐ), ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌ (ఆరెస్పీ) తదితర విపక్ష సభ్యులు మాట్లాడుతూ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. జేడీ(యూ) తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులు బిల్లులకు మద్దతుగా మాట్లాడారు. 

ముహూర్తం... సాయంత్రం 4! 
మూడు బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్‌ 
మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం నాలుగింటికి లోక్‌సభ కీలక ఓటింగ్‌ చేపట్టనుంది. స్పీకర్‌ ఓం బిర్లా గురువారం సభలో ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మోదీ తన చాంబర్లో కీలక భేటీ జరిపారు. అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన నబీన్, పలు ఎన్డీఏ పక్షాల నేతలు తదితరులు అందులో పాల్గొన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు కూడగట్టడంపై వారంతా చర్చలు జరిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్‌తో పాటు పలు కీలక విపక్ష పార్టీలు బుధవారమే ప్రకటించడం తెలిసిందే. అధికార ఎన్డీఏ కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ సొంతంగా మూడింట రెండొంతుల మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో శుక్రవారం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement