బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు.
తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.


