ప్రాణం తీసిన గూగుల్‌ మ్యాప్స్..!

Google Maps Gone Wrong? Man Drives Into Dam - Sakshi

 చీకటిలో డ్యామ్‌లోకి దూసుకెళ్లిన కారు, వ్యక్తి మృతి

సాక్షి, ముంబై:  ప్రస్తుత కాలంలో తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనం సాధారణంగా గూగుల్‌ మ్యాప్‌నే నమ్ముకుంటాం..గూగుల్‌ మ్యాప్స్‌ వచ్చిన తర్వాత, తక్కువ ట్రాఫిక్‌ ఉన్న మార్గాలను ఎంచుకోవడం, షార్ట్‌ కట్స్‌ను  తెలుసుకోవడంమే కాదు గూగుల్‌ మాత ఉందిగా ఎందుకు బెంగ అనేంతగా పరిస్థితి మారిపోయింది. అయితే గ్యూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని తప్పులో కాలేసిన సందర్భాలు  చాలానే ఉన్నాయి. తాజాగా గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్లి ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలో  చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్‌ కారులో సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నారు. డ్రైవర్ సతీష్‌,  మిత్రుడు  సమీర్, మరో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు.  మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా రాంగ్‌ రూట్  చూపించింది గూగుల్. కానీ అది తెలియని వీరు గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ పోయారు. చీకటిపడినా గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు.

అలా ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనిచ్చాడు..అంతే కారు క్షణాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ, సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక,  కారులోనే ప్రాణాలొదిలాడు. మరునాడు  సమాచారాన్ని అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడికి కొంతదూరంలో కారును పోలీసులు గుర్తించారు. అందులో సతీష్‌ మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

అయితే, అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందనిడిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే  తెలిపారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. ఈ బ్రిడ్జికిపైనే పెద్ద డ్యామ్ ఉన్న కారణంగా, నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జిమునిగిపోతుందని వెల్లడించారు. ఈ విషయం స్థానికులకు తెలుసు కనుక వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ రాత్రి పూట, గూగుల్‌  డైరెక్షన్‌ ఆధారంగా వెళ్లి  డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారన్నారు. గూగుల్ మ్యాప్‌లను గుడ్డిగా నమ్మితే, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని ఈ సంఘటన నిరూపిస్తోంది. సో...తస్మాత్‌ జాగ్రత్త!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top