అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం
బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తాం..
ఓటు బ్యాంకు రాజకీయాలను సహించే ప్రసక్తే లేదు
చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే
ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ స్పష్టీకరణ
జాంగీపూర్/కత్వా/కుష్మాండీ: పశ్చిమ బెంగాల్‌లో బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వబోమని తేల్చిచెప్పారు. శనివారం బెంగాల్‌లోని జాంగీపూర్, కత్వా, కుష్మాండీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ గుర్తింపు, భవిష్యత్తు పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, చొరబాటుదార్లకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్‌లో చాలా ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు.
‘మా, మాటీ, మనుష్’నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ వదిలేసిందని, అధికారం నిలబెట్టుకోవడానికి చొరబాటుదార్లపై ఆధారపడుతోందని ధ్వజమెత్తారు. వారి ఓట్లతో వారి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు బీజేపీకి ఆశీర్వాదంగా మారాలని చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
కమ్యూనిస్టులకు కార్బన్ కాపీగా తృణమూల్
‘‘బెంగాల్‌లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని కాపాడుతాం. మార్పును ఎవరూ అడ్డుకోలేరు. బెంగాల్‌లో అహంకారం ప్రదర్శించిన ఎంతోమంది అడ్రస్ లేకుండాపోయారు. బ్రిటిష్ పాలకులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు గతంలో ఏమైందో చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురవుతుంది. బెంగాల్‌లో శ్రీరామనవమి వేడుకల్లో హింస జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అది సహించలేక తప్పుడు వీడియోలు, అబద్ధాలను పోస్టు చేస్తున్నారు.
అస్సాం, పుదుచ్చేరిలోనూ ఇలాంటి కుతంత్రాలు సాగించారు. అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలి. బీజేపీని గెలిపించుకోవాలి. మా, మాటీ, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టు పార్టీలకు కార్బన్ కాపీగా మారిపోయింది. కమ్యూనిస్టు శక్తులు, సిండికేట్లు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి.
కమ్యూనిస్టుల పాలనలో జరిగినట్లుగానే వేధింపులు, అరాచకాలు, అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజలను బెదిరించేవారు. నేడు టీఎంసీ రౌడీలు సైతం అదే పని చేస్తున్నారు. అక్రమ ఆయుధా లు, డ్రగ్స్, పశువుల అక్రమ రవాణా, కట్ మనీ, కమీషన్లు.. ఇలా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కాంట్రాక్టు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను కచ్చితంగా శిక్షిస్తాం. ప్రజలను వేధించినవారి కోసం జైలు తలుపులు తెరుచుకుంటాయి’’ అని అన్నారు.
శరణార్థులకు భారత పౌరసత్వం
‘‘బీజేపీ అధికారంలోకి రాగానే మతువా, నామశూద్ర వర్గాలతోపాటు ఇతర శరణార్థులకు సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తాం. చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. వారు వెనక్కి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. చొరబాటుదార్లను కాపాడేవారికి కూడా శిక్ష తప్పదు. బెంగాల్‌లో మా నినాదం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ ఒక్కటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే సబ్‌కా హిసాబ్. ప్రతి అరాచకవాదిని, అవినీతిపరుడిని శిక్షిస్తాం. శరణార్థులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది.
అలాగే బీజేపీ పాలనలో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తోంది. బెంగాల్‌లోనూ మహిళల ఓట్లతో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి. బీజేపీ పాలన వచ్చాక.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిండికేట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బెంగాల్‌లో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తాం. వాటిని ఆపబోం’’అని మోదీ స్పష్టం చేశారు.
మహిళల భద్రతే మా ధ్యేయం
‘‘మహిళల భద్రతకు బీజేపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని నేరాలు జరిగాయి. వారిని దారుణంగా వేధించారు. మా ప్రభుత్వం వచ్చాక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. పాత కేసులను మళ్లీ తెరుస్తాం. ఇది మోదీ గ్యారంటీ. మహిళల భద్రతే మా ధ్యేయం. తృణమూల్ ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆటను కూడా సిండికేట్లకు అప్పగించింది. గత డిసెంబర్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా గందరగోళం జరిగింది. ఆ సిగ్గుచేటైన చిత్రాలను ప్రపంచమంతా చూసింది. బెంగాల్‌లో ప్రభుత్వం అంటే సిండికేట్, సిండికేట్ అంటే ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చట్టవిరుద్ధమైన పాలనకు పర్యాయపదం తృణమూల్ సర్కార్. మమతా బెనర్జీ పార్టీకి సిద్ధాంతాలు, విలువులు లేవు. అందుకే అది ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టలేకపోయింది’’అని మోదీ అన్నారు.


