సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జూన్‌లో లండన్‌లో మరణించిన సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన రూ. 30,000 కోట్ల ఆస్తులను పరిరక్షించాలని హైకోర్టు ఆదేశించింది. సంజీవ్ భార్య ప్రియా కపూర్ వాటిని అమ్మకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అతని బ్యాంకు ఖాతాల కార్యకలాపాలను కూడా కోర్టు పరిమితం చేసింది.వారసత్వంపై ఆయన కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
సంజయ్ కపూర్, కరిష్మా పిల్లలైన కియాన్, సమైరా కపూర్‌లకు, ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవా కపూర్‌కు మధ్య నెలకొన్న తీవ్రమైన, కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వసంజయ్ కపూర్ విదేశాల్లో ఉన్నప్పుడు ఫోర్జరీ చేసిన వీలునామాను ప్రియా కపూర్ సృష్టించారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో ఖరీదైన పోలో గుర్రాలు, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీలు, విలువైన పెయింటింగ్స్ మరియు స్థిరాస్తులను కావాలనే దాచి పెట్టారని వారు వాదించారు.
వీరి పిటిషన్‌ను విచారించిన కోర్టు సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకుండా ప్రియా కపూర్‌పై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆస్తులు కరిగిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా కోర్టు నిలిపివేసింది.
వీలునామాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రియా కపూర్‌పైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వీలునామా నకిలీదని తేలితే, అప్పటికే ఆస్తులు చేతులు మారి ఉంటే అది అన్యాయం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం పిల్లలతోనే కాకుండా, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, సోదరి మందిరా కపూర్ కూడా ప్రియా కపూర్‌తో వివాదంలో ఉన్నారు. గతంలో ఈ వివాదాన్ని ఉద్దేశించి "మురికి బట్టలను బహిరంగంగా ఉతకవద్దు" అని కోర్టు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: 34 ఏళ్ల మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్ బంగ్లాలో ఎముకలు
కాగా 53 ఏళ్ల వయసులోనే సంజయ్ కపూర్ గత ఏడాది జూన్ 12న లండన్‌లో పోలో ఆడుతూ అకస్మాత్తుగా కన్నుమూయడం దిగ్భ్రాంతి రేపింది. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తొలుత భావించారు. తన కొడుకు మరణంలో ఏదో అతని తల్లి అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. అయితే, ఆగస్టులో బ్రిటీష్ వైద్య అధికారులు ఆయన సహజ కారణాల వల్లే (గుండె సంబంధిత వ్యాధి) మరణించారని ధృవీకరించారు.
ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!


