వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు! | 2 Mumbai cops flipped omelettes for 15 days to arrest thieves | Sakshi
Sakshi News home page

వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!

Apr 30 2026 12:23 PM | Updated on Apr 30 2026 12:46 PM

2 Mumbai cops flipped omelettes for 15 days to arrest thieves

సాక్షి, ముంబై: అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడానికి  పోలీసులు రహస్యంగా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ విశేషంగా నిలుస్తోంది. 15 రోజుల పాటు వారు చేసిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ నెట్టింట  వైరల్‌గా మారింది.  మారువేషంలో చిరు వ్యాపారులుగా వారు చేసిన ఆపరేషన్‌ వివరాలేంటో తెలుసుకుందాం..పదండి! 

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడానికి గుజరాత్‌లోని సూరత్‌లో 15 రోజుల పాటు మారువేషంలో పనిచేశారు. చిరు వ్యాపారులుగా నటించారు. ఉల్లిపాయలు తరుగుతూ, కస్టమర్లకు ఆమ్లెట్లు, భుర్జీ వడ్డిస్తూ అత్యంత సాహసోపేతంగా దొంగల్ని  పట్టుకునేందుకు వెయిట్‌ చేశారు.

ఆపరేషన్ సక్సెస్‌
నిందితులు నివసించే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్‌లో కానిస్టేబుళ్లు యోగేష్ నవ్‌సరే, ప్రదీప్ దండ్వటే ఆమ్లెట్లు, భుర్జీ అమ్ముతున్నట్లు నటిస్తూ నిఘా పెట్టారు. రెండు వారాల నిరీక్షణ తర్వాత నిందితుల గుర్తింపును నిర్ధారించుకుని, ఏప్రిల్ 27న నిందితులు గురుదాస్ సురేష్ కోలి (28) అమోల్ గోకుల్ జాదవ్ (33) అదుపులోకి తీసుకున్నారు. 

ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!

అసలు కేసు వివరాలు
మార్చి 19న వేదాంత్ నగర్‌లోని ఇంద్రనీల్ అపార్ట్‌మెంట్‌లో రూ. 3.23 లక్షల విలువైన నగదు, వస్తువులు చోరీకి గురయ్యాయి. పోలీసులు దాదాపు 150 సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా, ఒక నిందితుడి ముఖం స్పష్టంగా కనిపించింది. పాత నేర చరిత్ర రికార్డులతో సరిపోల్చగా, నిందితులు సూరత్‌లోని పల్సానా తాలూకాలో ఉన్నట్లు తేలింది.ఈ ఆనవాలే దర్యాప్తు అధికారులకు దారి చూపింది.

నేరస్తుల మోడస్‌ ఒపెరాండీ
విచారణలో నిందితులు వ్యవహరిస్తున్న తీరు చూసి పోలీసులే షాకయ్యారు.  తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, లాకర్లను పగులగొట్టి క్షణాల్లో మాయమైపోవడం వీరి శైలి.  కార్లకు అనేక రకాల నకిలీ నంబర్ ప్లేట్లను వాడుతూ పోలీసుల కళ్లు గప్పేవారు. పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా  పనిముగించుకుని తప్పించుకునేవారు. అంతేకాదు తమ సొంత ఫోన్లను వాడకుండా, కేవలం కొన్ని యాప్‌ల సహాయంతో టోల్ గేట్లు లేని రూట్లను గుర్తించి ప్రయాణించేవారు. 

ఎంతటి నేరస్తులైనా, పోలీసులు తలచుకుంటే చిక్కక తప్పదు. ఈ కేసులోనూ అదే జరిగింది.  సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు, కానిస్టేబుళ్లు యోగేష్ నవసారే, ప్రదీప్ దండ్వటే సూరత్‌కు వెళ్లి, అనుమానితులున్న ప్రదేశంలో ఒక ఫుడ్ కార్ట్ వద్ద నిఘా వేసి దొంగల ఆట కట్టించారు. నిందితులపై ఛత్రపతి శంభాజీనగర్‌లో 8 కేసులు, నాసిక్‌లో సుమారు 28 కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కోర్టు నిందితులను మే 5 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ఇతర కేసుల్లో వీరి ప్రమేయం గురించి పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement