ఆటో డ్రైవర్‌ కూతురు ఇంటర్‌లో అదరగొట్టింది

Auto Driver Daughter Scores 98 Percentage In Inter - Sakshi

డెహ్రాడూన్‌ : చదువులో ప్రతిభ కనపర్చడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డుకాదని నిరూపించిందో యువతి. ఇంటర్‌లో 98 శాతం మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఐరమ్‌(18) అక్కడి పూల్‌చంద్‌ నారి శిల్ప బాలికల ఇంటర్‌ కాలేజ్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్‌ చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల చదువు దగ్గర ఏమాత్రం రాజీ పడలేదు. తండ్రి కష్టాన్ని వృధాకానీకుండా.. ఐరమ్‌ చదువు తన ఊపిరిగా చేసుకుంది. ఇష్టపడి చదివి ఇంటర్‌లో 98 శాతం మార్కులు సాధించింది. అంతేకాదు బయాలజీలో 99 శాతం మార్కులు సాధించింది.

దీనిపై ఐరమ్‌ మాట్లాడుతూ.. ‘‘వైద్యురాలు కావాలన్నదే నా లక్ష్యం. నేనిప్పుడు నీట్‌కు సిద్ధం అవుతున్నాను. నేను డాక్టర్‌ అవ్వటం వల్ల మా ఇంటి ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాను. నాకు ఆర్థికంగా సహాయం చేసిన నా ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉన్నాను. కోవిడ్‌ కారణంగా నాన్న సంపాదన బాగా తగ్గింది. నేను, మా అక్క ఇద్దరం ఒకే ఫోన్‌లో ఆన్‌లైన్‌ తరగతులు విన్నాం’’ అని పేర్కొంది. 

ఐరమ్‌ తండ్రి ఇర్ఫాన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ‘‘ నా పిల్లలకు మంచి విద్య అందించటానికి డెహ్రాడూన్‌ వచ్చాను. నాకొచ్చే అరకొర సంపాదనతో నా నలుగురు పిల్లలను చదివించటం సాధ్యపడలేదు. అందుకే పెద్ద బిడ్డను చదువు మాన్పించి నాకు సహాయంగా ఉండమని కోరాను. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా ఉన్న పని కూడా పోయింది. లోన్‌ల ద్వారా పిల్లలకు చదువు చెప్పించాను. వారందరూ చక్కగా డిగ్రీ చదువులు పూర్తి చేస్తారనుకుంటున్నాను. ఐరమ్‌ ఇంటర్‌లో ప్రతిభ కనపర్చడం గర్వంగా ఉంది. నా పిల్లలెవరూ భవిష్యత్తులో ఆటో నడపరని భావిస్తున్నాను’’ అని అన్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top