నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. జిల్లాలోని 866 మంది సర్పంచ్‌లకు ఐదు నెలల 10 రోజుల గౌరవ వేతనాల చెల్లింపునకు రూ.3.55 కోట్లను విడుదల చేసింది. జిల్లా పంచాయతీ కార్యాలయం బిల్లులను ట్రెజరీకి సమర్పించగా, ఒకటి రెండు రోజుల్లో సర్పంచ్‌ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా, 866 గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు ఉన్నారు. వీరికి నెలకు రూ.6,500 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. గతేడాది డిసెంబర్ 20న బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్‌లకు ఇప్పటివరకు వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంతో సర్పంచ్‌ల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
శిక్షణ సంస్థల నుంచి ప్రతిపాదనల ఆహ్వానం
నల్లగొండ : తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుంది. తెలంగాణ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ‘ట్రైనింగ్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలతో అనుబంధం, ఉపాధి కల్పనలో అనుభవం ఉన్న శిక్షణ భాగస్వామ్య సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల శిక్షణ సంస్థలు తమ ప్రతిపాదనలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం, నల్లగొండలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల అందజేతకు గడువు, దరఖాస్తు విధానం కోసం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలిపారు.
చర్చల కమిటీ ఏర్పాటు చేయాలి
మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల నూతన వేతన సవరణకు సంబంధించి యాజమాన్యాలతో చర్చించేందు వీలుగా వేతన కమిటీని ఏర్పాటు చేయాలని టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం నాయకులతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ.. గతంలో కుదిరిన వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసి రెండు నెలలు దాటుతున్నా నూతన కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. విద్యుత్ రంగాన్ని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన వేతన సవరణ, అలవెన్సుల ఖరారు కోసం తక్షణమే చర్చల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
కూలి పోరాటాలు
ఉధృతం చేస్తాం
తిప్పర్తి : భూమి, కూలి పోరాటాలను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 20వ మహసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతన చట్టం చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భూ సీలింగ్ చట్టాన్ని సవరించి, ప్రాజెక్టుల కింద రెండు పంటలు పండే భూములు ఐదు ఎకరాల కంటే మించి ఉంటే పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేయకుంటే భూ పోరాటాలు చేస్తామన్నారు. భూమి లేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు తగ్గించి వ్యవసాయ కార్మికుల పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య, నాయకులు నన్నూరి వెంకట రమణారెడ్డి, లింగస్వామి, మన్నెం భిక్షం, రాములు, చెరుకు పెద్దులు, మారయ్య, సుకన్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


