ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించని 418 స్కూల్‌ బస్సులు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించని 418 స్కూల్‌ బస్సులు

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలలు జూన్‌ 15 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,739 స్కూల్‌ బస్సులు ఉండగా, ఇప్పటివరకు 1,321 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందాయి. ఇంకా 418 బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించని బస్సులను పాఠశాలల ప్రారంభం తర్వాత రోడ్లపైకి అనుమతించబోమని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

యాజమాన్యాల నిర్లక్ష్యం

ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్‌ బస్సులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్రేకులు, టైర్లు, ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్‌ సేఫ్టీ పరికరాలు, సీట్ల స్థితి వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తారు. దీనిపై రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. యాజమాన్యాలు ఇప్పటికీ ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం ముందుకు రావడం లేదు.

నల్లగొండ జిల్లాలోనే అధికం..

● ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్కూల్‌ బస్సులు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. మొత్తం 759 బస్సుల్లో 578 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకోగా, ఇంకా 181 బస్సులు తనిఖీలకు హాజరుకావాల్సి ఉంది.

● సూర్యాపేట జిల్లాలో మొత్తం 592 స్కూల్‌ బస్సులు ఉన్నాయి. వీటిలో 420 బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందగా, 172 బస్సులు ఇంకా పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది.

● యాదాద్రి–భువనగిరి జిల్లాలో మొత్తం 388 స్కూల్‌ బస్సులు ఉండగా, 323 బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేశాయి. మరో 65 బస్సులు ఇంకా తనిఖీలకు రాలేదు.

విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యం

రోజూ వేలాది మంది విద్యార్థులను తరలించే స్కూల్‌ బస్సుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు మిగిలిన 418 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పెండింగ్‌లో ఉన్న వందలాది స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి కావడం ఇప్పుడు రవాణా శాఖకు సవాల్‌గా మారింది. విద్యార్థుల భద్రత కోసం యాజమాన్యాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.

ఫ 15వ తేదీనే పాఠశాలల పునఃప్రారంభం

ఫ ఫిట్‌నెస్‌ లేకుండా రోడెక్కితే సీజ్‌

చేస్తామని హెచ్చరిస్తున్న అధికారులు

జిల్లాల వారీగా స్కూల్‌ బస్సుల వివరాలు ఇలా..

జిల్లా బస్సులు ఫిట్‌నెస్‌ పూర్తి పెండింగ్‌

నల్లగొండ 759 578 181

సూర్యాపేట 592 420 172

యాదాద్రి 388 323 65

మొత్తం 1739 1321 418

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement