పానగల్‌లో మరో పంప్‌హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

పానగల్‌లో మరో పంప్‌హౌస్‌

Jun 11 2026 8:17 AM | Updated on Jun 11 2026 8:17 AM

మంత్రి చొరవతోనే

నిధులు మంజూరు

నీలగిరిలో రోజూ తాగునీటి సరఫరాకు 50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మాణం

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి నగరంలో తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. నగరంలో ఇంటింటికీ రోజూ తాగునీటి సరఫరాకు ప్లాంట్‌ నిర్మించనున్నారు. ఇందుకుగాను తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) నుంచి రూ.83 కోట్లు మంజూరు చేస్తూ మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి జనాభాకు అనుగుణంగా తాగునీరు అందించడానికి కొత్త పంప్‌హౌస్‌ నిర్మాణం చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పానగల్‌లో 50 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే (ఎంఎల్‌డీ) సామర్థ్యం గల మరో పంప్‌హౌస్‌ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఈ పానగల్‌లో పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయితే నీలగిరి నగరంలో తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు.

రోజుకు 5 కోట్ల లీటర్ల తాగునీటి సరఫరా..

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 48 డివిజన్ల పరిధిలో సుమారు 2.50 లక్షల వరకు జనాభా ఉంది. ఈ జనాభాకు ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక బోర్ల ద్వారా పలు కాలనీలకు నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నగరంలో 24 గంటలపాటు ఇంటింటికి తాగు నీరందిస్తానని పలుమార్లు చెప్పిన ప్రకారం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి మాట నిలబెట్టుకున్నారు. కొత్త పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్‌ నుంచే ప్రతి రోజూ 50 ఎంఎల్‌డీ తాగునీరు అందనుంది. నగర ప్రజలకు రోజుకు 5 కోట్ల లీటర్ల తాగునీటిని అందించనున్నారు. ప్రస్తుతం నగరంలో 10 నీటి ట్యాంకులను కొత్తగా నిర్మిస్తుండగా పాతవి 15 ఉన్నాయి. మొత్తం 25 ట్యాంకుల నుంచి నగరంలోరి 48 డివిజన్లకు తాగునీటి సరఫరా జరగనుంది.

నీలగిరి నగర ప్రజలకు రోజూ తాగునీరు అందించడానికి కొత్త పంప్‌హౌస్‌ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేయించిన మంత్రికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.

– బుర్రి చైతన్య, నగర మేయర్‌

ఫ రాబోయే 30 సంవత్సరాల్లో

ప్రజల అవసరాలకు అనుగుణంగా..

ఫ రూ.83 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement