ఫ పెద్దకాపర్తి వద్ద 700 మీటర్ల పొడవుతో నిర్మాణం
ఫ త్వరలోనే ప్రారంభానికి సన్నాహాలు
చిట్యాల : జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ నియంత్రణతోపాటు వాహనాలు వేగంగా వెళ్లేందుకు చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ప్రస్తుతం ఫ్లై ఓవర్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. త్వరలోనే ఈ ఫ్లై ఓవర్‌ని అధికారికంగా ప్రారంభించేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేలా..
జాతీయ రహదారిపై తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోపాటు గతంలో ఉన్న ఫ్లై ఓవర్ కింద నుంచి పెద్దకాపర్తి మీదుగా రామన్నపేట, చిన్నకాపర్తికి వెళ్లే వాహనాలకు ఇక్కట్లు కలిగేవి. అంతేకాకుండా పెద్దకాపర్తి వద్ద సాధారణ రోజులతోపాటు వారాంతపు సెలవులు, దసరా, సంక్రాంతి పండుగల సమయాల్లో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయేవి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఇబ్బందులను తొలగించేందుకు 21 జూన్ 2024లో పెద్దకాపర్తి వద్ద హైవేపై ఫ్లై ఓవర్ నిర్మించేందుకు నిర్ణయించారు.
700 మీటర్లు.. రూ.30 కోట్లు
పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై 700 మీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.30 కోట్లు కేటాయించింది.ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పెద్దకాపర్తి వద్ద తరచుగా జరిగే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు వాహనదారులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోనున్నారు.


