ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ చంద్రశేఖర్‌

Jun 11 2026 8:17 AM | Updated on Jun 11 2026 8:17 AM

నల్లగొండ టౌన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి అధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు డీఎంహెచ్‌ఓగా పనిచేసిన పుట్ల శ్రీనివాస్‌ హైదరాబాద్‌ జిల్లా డీఎంహెచ్‌ఓగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎల్‌బీనగర్‌ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ నియమించింది. గురువారం ఆయన విధుల్లో చేరనున్నట్టు సమాచారం.

మాజీ సైనికులు దరఖాస్తు చేసుకోవాలి

నల్లగొండ టూటౌన్‌ : ఉమ్మడి జిల్లాలో ఉన్న మాజీ సైనిక వితంతువులు, పెన్షన్‌ లేని మాజీ సైనికులు హైదరాబాద్‌ ఇందిరమ్మ హౌసింగ్‌ పథకం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి వనజ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు తెలంగాణ నివాసి అయి కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు ఉండరాదని, తక్కువ ఆదాయం కలిగి ఉండాలని, ఇంతకుముందు ప్రభుత్వ పథకాల ద్వారా గృహ ప్రయోజనం పొంది ఉండరాదని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం జతచేసి తమ దరఖాస్తులను ఈ నెల 12లోగా నల్లగొండలోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

నీటి వనరులను సంరక్షించుకోవాలి

మర్రిగూడ (చింతపల్లి) : నీటి వనరుల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. జల సంచయ్‌ జన భాగీరథీ కార్యక్రమంలో భాగంగా బుధవారం చింతపల్లి మండలం కొడకొండ్ల గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో నీటి నిల్వ కోసం నీటి కుంటలు నిర్మించుకోవాలన్నారు. వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు వాలుకు అడ్డంగా రాళ్ల కట్టలు నిర్మించడం, గుట్టల ప్రాంతాల్లో కందకాలు తవ్వడం వంటి పనులు చేపట్టడం ద్వారా నేల కోతను నివారించవచ్చన్నారు. నీటి వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించి భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సదస్సులో ఎంపీడీఓ సుజాత, సర్పంచ్‌ కాశగోని వెంకటయ్య, ఏపీఓ శౌరిరెడ్డి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

ఆలేరులో 12న ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్‌ సమావేశం

నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దినేష్‌ గార్డెన్‌లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గోపగాని మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement