మాడుగులపల్లి : కాలం ముంచుకొస్తున్నా అన్నదాతలకు యాసంగి ధాన్యం అమ్మకం కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షాలు భయపెడుతుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, రవాణా సౌకర్యాల లేమి రైతులను దెబ్బ తీస్తున్నాయి. మాడ్గులపల్లి మండల పరిధిలోని గండ్రవానిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి గండ్రవానిగూడెం కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పది రోజులుగా కాంటాలు వేసిన ధాన్యం అక్కడే ఉంది. తాజాగా కురిసిన భారీ వర్షానికి దాదాపు 5 నుంచి 6 లారీల ధాన్యం బస్తాలు తడిశాయి. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఒక్కటే లారీ.. నాలుగు రోజుల నిరీక్షణ
గండ్రవానిగూడెం కేంద్రానికి రవాణా కాంట్రాక్టర్ కేవలం ఒకే ఒక్క లారీని కేటాయించడం గమనార్హం. ఇక్కడి నుంచి మిల్లులకు వెళ్లిన ఆ లారీ.. అక్కడ అన్‌లోడ్ అయి తిరిగి ఈ కేంద్రానికి రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోంది. ఆ లారీ తిరిగి వస్తేనే ఇక్కడ ధాన్యం తరలించేది.
రైతుల ఆందోళన
మంగళవారం అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి ఆందోళన చేపట్టారు. కాంటాలు వేసి 25 రోజులైనా ఇప్పటివరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆందోణ కొనసాగడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ సీఈవో రవీంద్రరావు వచ్చి తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడానని బుధవారం వరకు ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరవించారు.
ఫ వర్షాలకు తడుస్తున్న ధాన్యం
ఫ లారీల కొరతతో తరలింపు ఆలస్యం
ఫ ధాన్యం ఎగుమతి చేయాలని కుక్కడం వద్ద రోడ్డెక్కిన రైతులు


