హాలియా : పాఠశాలల పునః ప్రారంభంలోపే పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. హాలియా పట్టణంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్సీ బాలికల హాస్టల్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పట్టణంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసి ప్రారంభోత్సవానికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది తదితర విషయాలపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృనాయక్‌తో చర్చించారు. అనంతరం స్థానిక కేజీబీవీని తనిఖీ చేసి పాఠశాలలో టాయిలెట్లు, తాగునీటి వసతి ఉండేలా చూడాలని డీఈఓ సుశీందర్‌రావును ఆదేశించారు. సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల హాస్టళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల హాస్టల్‌లో మరమ్మతు పనులు పరిశీలించి హాస్టల్‌లో నీరు నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డికి సూచించారు. బీసీ బాలికల వసతి గృహంలో సౌకర్యాలు, స్టోర్ రూం, డార్మెటరీని తనిఖీ చేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల ఆవరణలో చేపట్టిన తాగునీటి ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోగా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి తక్షణమే వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ వెంకటేశ్వరు, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ గౌని రాజారమేష్ యాదవ్, కమిషనర్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, డిప్యూటీ ఇంజనీర్ విభాగం అధికారులు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్


