ప్రభుత్వ బడికే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడికే

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

ములుగు: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దీంతో విద్యాలయాలు సందడిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్వానం పలికేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అలాగే చెత్తాచెదారం శుభ్రం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో వర్షం నీరు నిల్వకుండా ఉండేలా మట్టిపోసి చదును చేశారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, బెంచీలు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్లు, డిజిటల్‌ క్లాసులు, ప్రత్యేక తరగతులు, నాణ్యమైన బోధన, విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. అదే విధంగా ఫలితాల్లో స్థిరమైన పురోగతి, ఆటలాడేందుకు క్రీడామైదానం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యునిఫాంలను ప్రభుత్వం సమకూర్చడంతో సర్కారు బడుల ముఖచిత్రాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో సర్కారు బడుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతుండగా.. చిన్నారుల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు మక్కువ చూపుతున్నారు.

ప్రైవేట్‌ నుంచి.. ప్రభుత్వ బడులకు

మారుతున్న ట్రెండ్‌

ఒకప్పుడు సర్కారు బడులంటే చిన్నచూపు ఉండేది. దీంతో ప్రైవేట్‌ స్కూళ్ల వైపే పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచేవారు. దీంతో మండల కేంద్రంతో పాటు మేజర్‌ గ్రామ పంచాయతీల పరిధిలో విచ్చలవిడిగా ప్రైవేట్‌ పాఠశాలలు వెలిశాయి. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చాలావరకు మూతపడ్డాయి. కాని గత కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు డిజిటల్‌ బోధన కూడా మొదలు కావడంతో పరీక్ష ఫలితాల్లో సైతం సర్కారు పాఠశాలల విద్యార్థులే విజయఢంకా మోగిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే జిల్లాకు ప్రథమ స్థానం రావడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా ట్రెండ్‌ మారిపోయింది. ప్రైవేట్‌ పాఠశాలలను విడిచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో మూతపడిన కొన్ని పాఠశాలలను సైతం ఈ విద్యా సంవత్సరం విద్యాశాఖాధికారులు నూతనంగా ప్రారంభించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి యూపీఎస్‌ పాఠశాలలో ఏకంగా 12 మంది విద్యార్థుల నుండి 138 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆడ్మిషన్‌ పొందడం జిల్లాలోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే పాఠశాలను ఆదర్శంగా తీసుకొని మిగతా పాఠశాలలను సైతం బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది.

374 పాఠశాలలు.. 19,653 మంది

విద్యార్థులు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 374 ప్రభుత్వ పాఠశాలల్లో 19,523 మంది విద్యార్థులు బోధనను అభ్యసించనున్నారు. అలాగే 32 ప్రైవేట్‌ పాఠశాలల్లో 8 వేల మంది మాత్రమే అడ్మిషన్లు పొంది ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఏటూరునాగారం మండలంలో 256, గోవిందరావుపేటలో 72, కన్నాయిగూడెంలో 126, మల్లంపల్లిలో 55, ములుగులో 163, ఎస్‌ఎస్‌ తాడ్వాయిలో 183 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అలాగే వెంకటాపురం(ఎం)లో 91, వెంకటాపురం(కె)లో 103, వాజేడులో 63, మంగపేటలో 162 మంది పిల్లలను నూతనంగా పాఠశాలల్లో చేర్పించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,274 మంది పిల్లలు బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్లు పొందారు.

వెంకటాపురం(ఎం) జెడ్పీ ఉన్నత పాఠశాల ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు

వాజేడులోని పాఠశాల ఆవరణలో నీరు

నిల్వకుండా పోస్తున్న మట్టి

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

జిల్లాలో మారుతున్న విద్యారంగ

సమీకరణలు

ప్రభుత్వ పాఠశాలలకు

పెరుగుతున్న ఆదరణ

గవర్నమెంట్‌ స్కూల్స్‌ వైపే విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు

సంవత్సరం పాఠశాలలు విద్యార్థులు

2022–23 335 16,850

2023–24 357 18,204

2024–25 352 17,549

2025–26 357 17,749

2026–27 374 19,523

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement