ఏటూరునాగారం: ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా టీవీఆర్ దామోదరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈయన గతంలో స్థానిక ఐటీడీఏఓగా పనిచేస్తూ ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న దామోదరస్వామికి ఉద్యోగోన్నతి రావడంతో ఏటూరునాగారంలో ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో మరో రెండు రోజుల్లో ఏటూరునాగారం ఏపీఓగా ఆయన బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రవి
ములుగు రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన తోకల రవిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2004 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.
ఎంజీఎంలో డిప్యుటేషన్‌పై నర్సింగ్ సిబ్బంది
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్‌పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్‌తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్‌పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్‌కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.
అవగాహన కల్పించినా కాల్చేస్తున్నారు
మహాముత్తారం: రైతులు పంటలు పండించిన అనంతరం వాటిని పొలంలో కలియ దున్నాలి కానీ కాల్చవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. కానీ మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు వరికొయ్యలను కాల్చుతూ సారవంతమైన భూమిలోని క్రిమి కీటకాలను చంపేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వరికొయ్యలను కాల్వడం వలన భూమిలోని క్రిమి కీటకాలు చనిపోవడమే కాకుండా భూమిపొర వేడికి సారవంతాన్ని కోల్పోయి పంటదిగుబడి తగ్గుతుందని ఎవరైనా రైతులు కొయ్యకాళ్లను కాలబెడితే నష్టాన్ని బట్టి 5వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ గ్రామాల్లోని రైతులు మాత్రం కొయ్యకాళ్లను తగల బెడుతున్నారు.
లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని లాడ్జిల్లో సీసీఎస్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతిథుల రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సీసీఎస్ సీఐ రమేష్ పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి అతిథి ఆధార్ వివరాలు, రాకపోకల సమయాలు, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.


